Hyderabad: గ్రేటర్‌లో 30 ఘాట్లలో ఛట్‌ పూజోత్సవాలు: జన్‌ సేవా సంఘ్‌!

Hyderabad: హైదరాబాద్‌లో నవంబరు 13 నుంచి 16 వరకు 30 ఘాట్లలో ఛట్‌ పూజలు నిర్వహించనున్నట్లు జన్‌ సేవా సంఘ్‌ వెల్లడించింది. ఏర్పాట్లపై జీవో ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

GIRI, CENTRAL ZONE
Published on: 28 Oct 2026 7:39 PM IST
Hyderabad
X

Hyderabad: గ్రేటర్‌లో 30 ఘాట్లలో ఛట్‌ పూజోత్సవాలు: జన్‌ సేవా సంఘ్‌!

హైదరాబాద్: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్‌ పూజోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసేందుకు జీవో విడుదల చేయడంపై జన్‌ సేవా సంఘ్‌ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

జన్‌ సేవా సంఘ్‌ ఆధ్వర్యంలో నవంబరు 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఛట్‌ పూజోత్సవాలను నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు బిశ్వదీప్‌ సింగ్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో పూజోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నెక్లెస్‌ రోడ్‌, సంజీవయ్య పార్కుతో పాటు మొత్తం 30 ఘాట్‌లలో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

నవంబరు 13, 14 తేదీల్లో భక్తులు ఉపవాస దీక్షలు చేపడతారని, 15న సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో నీటిలో నిలబడి సూర్యభగవానుడికి పూజలు చేస్తారని వివరించారు. 16న తెల్లవారుజామున 5 గంటల నుంచే సూర్యోదయ పూజలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

ఈ వేడుకలకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. సుమారు లక్ష మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ సూర్యభగవానుడిని ఆరాధించడం ఛట్‌ పూజ ప్రత్యేకత అని పేర్కొన్నారు.

ఉత్తర భారతదేశంతో పాటు నేపాల్‌లోనూ ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం నవంబరు 15, 16 తేదీలను రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించాలని బిశ్వదీప్‌ సింగ్‌ కోరారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE