Hyderabad: 3 చెరువులకు హైడ్రా ఫెన్సింగ్, స్థలాల పరిరక్షణ
Hyderabad: హైదరాబాద్ పరిధిలో మూడు చెరువులకు హైడ్రా ఫెన్సింగ్ వేసి, రాంపల్లిలో 2,924 గజాల పార్కు, ప్రజావసరాల స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడింది.
Hyderabad: 3 చెరువులకు హైడ్రా ఫెన్సింగ్, స్థలాల పరిరక్షణ
హైదరాబాద్: క్యూర్ (కోర్ అర్బన్ రీజయన్ ఎకానమీ) పరిధిలో చెరువుల పరిరక్షణను హైడ్రా కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలను రక్షిస్తూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా గురువారం 3 చెరువులకు ఫెన్సింగ్ వేసింది. వీటితో పాటు.. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కూడా హైడ్రా కాపాడుతోంది. కీసర మండలం రాంపల్లి గ్రామ పరిధిలోని శ్రీనివాస్ కాలనీ, సర్వే నంబరు 414/105లో ప్రజావసరాలకు ఉద్దేశించిన 1127 గజాల స్థలాన్నిహైడ్రా కాపాడింది.
అలాగే ఇదే ప్రాంతంలో 1797 గజాల పార్కు స్థలాన్ని కూడా హైడ్రా కాపాడింది. 1980లలో వేసిన ఈ లే ఔట్లో పార్కులు, ప్రజావసరాలకోసం కేటాయించిన స్థలాలను నోటరీమీద ప్లాట్లు చేసి అమ్మడం జరిగింది. అలా కొన్న వారు ప్రీకాస్ట్ వాల్స్తో ప్రహరీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే 300ల గజాలలో ఓ ఇంటిని కూడా నిర్మించారు. ఆ ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ఈ అంశం కోర్టులో ఉంది. దీంతో ఆ ఇంటిని వదిలేసి మిగతా ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, గ్రామం సర్వే నంబరు 54లో ఉన్న చాకలి చెరువును కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. మొత్తం 16.20 ఎకరాల చెరువు పరిధి కాగా ఇందులో దాదాపు 4 ఎకరాల వరకూ కబ్జాలకు గురౌతున్నట్టు స్థానికుల నుంచి ఫిర్యాదు అందింది.
అక్కడ తాత్కాలికంగా వేసిన షెడ్డులను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలంలోని ఫతుల్లగూడ చెరువుకు హైడ్రా ఫెన్సింగ్ వేసింది. 19 ఎకరాలకు పైగా ఉన్న ఎఫ్టీఎల్ను పరిరక్షిస్తూ హైడ్రా చర్యలు తీసుకుంది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామంలోని బందంకొమ్ము చెరువును కూడా హైడ్రా కాపాడింది. 27.056 ఎకరాల చెరువు భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక్రమణలకు అడ్డుకట్ట వేసింది. చెరువుల భూములు ఆక్రమణలకు గురికాకుండా, వాటి పరిధులను కాపాడేందుకు హైడ్రా చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ పనులు చేపట్టింది.




