Traffic Diversions: వాహనదారులకు బిగ్ షాక్.. కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ రూల్స్

Traffic Diversions: వాహనదారులు కొద్ది రోజుల పాటు సైన్ బోర్డులను గమనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించి పోలీసులకు సహకరించడం శ్రేయస్కరం.

CR Reddy
Published on: 18 Aug 2026 7:39 AM IST
Traffic Diversions
X

Traffic Diversions

Traffic Diversions: భాగ్యనగరంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రతిష్టాత్మక హెచ్-సిటీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ పూర్తిస్థాయిలో వన్-వే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. పొరపాటున పాత దారుల్లో వెళ్తే భారీ జరిమానాలు పడే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మక హెచ్-సిటీ ప్రాజెక్టు మొత్తం రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీల్లో ఈ పనులను చేపట్టనున్నారు. పార్క్ చుట్టూ ఉన్న ఆరు కీలక జంక్షన్లలో 7 అండర్‌పాస్‌లు, 7 మల్టీలెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణం జరగనుంది. రాబోయే 24 నెలల పాటు ఈ నిర్మాణ పనులు నిరంతరం కొనసాగనున్న నేపథ్యంలో ముందస్తుగా ఈ సుదీర్ఘ ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు.

కొత్త రూట్ మ్యాప్ ఇదే.. ఏ వైపు ఎలా వెళ్లాలి?

పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్ భవన్ సిగ్నల్ వద్ద లెఫ్ట్ తీసుకుని క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ చౌరస్తా, జర్నలిస్టు కాలనీ మీదుగా రోడ్ నెం. 45 ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. లేదా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు వెళ్లి అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందిరానగర్, వెంకటగిరి నుంచి ఫిల్మ్‌నగర్ వైపు వెళ్లేవారు ఇకపై నేరుగా వెళ్లేందుకు వీల్లేదు. వీరు చెక్‌పోస్ట్ వద్ద లెఫ్ట్ తీసుకుని ఎన్టీఆర్ భవన్, అగ్రసేన్ చౌరస్తా చుట్టూ తిరిగి ఫిల్మ్‌నగర్ చేరుకోవాలి. మాదాపూర్ నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలు చెక్‌పోస్ట్, ఎన్టీఆర్ భవన్ మీదుగా సాధారణంగానే ప్రయాణించవచ్చు.

13 లేన్ చేంజర్లు.. డ్రోన్ల నిఘాతో రియల్ టైమ్ పర్యవేక్షణ

కేబీఆర్ పార్క్ చుట్టూ ఎదురెదురుగా వచ్చే వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. వాహనదారులు రెండు దారుల్లోనూ ఒకే దిశలో క్లాక్‌వైజ్ తరహాలో ప్రయాణించాల్సి ఉంటుంది. డ్రైవర్లు సులువుగా పక్క లేన్లలోకి మారేందుకు 13 లేన్ చేంజర్లు, 10 ఎగ్జిట్ పాయింట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కొత్త మార్గాల్లో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. గూగుల్ మ్యాప్స్‌లో కూడా ఈ మార్పులను అప్‌డేట్ చేశారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

పార్క్ వద్దకు వచ్చే వాకర్లు, విజిటర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. తొలి కొన్ని రోజులు ఈ కొత్త దారుల వల్ల ప్రయాణికులకు కాస్త గందరగోళం అనిపించినా, ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో వన్-వే నిబంధనలను ఉల్లంఘించి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం, అతివేగంతో వెళ్లడం లాంటి పొరపాట్లు చేస్తే కఠినమైన చలాన్లు విధిస్తామని స్పష్టం చేశారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story