కేపీహెచ్‌బీలో దారుణం..ప్రియురాలు గర్భం దాల్చిందని మాత్రలిచ్చిన ప్రియుడు..యువతికి ఏమైందంటే..?
Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పరిధిలో వివాహితైన యువకుడితో ఏర్పడిన పరిచయం కారణంగా గర్భం దాల్చిన యువతి.. అబార్షన్ మాత్రలు వికటించి చికిత్స పొందుతూ మృతి చెందింది.
కేపీహెచ్‌బీలో దారుణం..ప్రియురాలు గర్భం దాల్చిందని మాత్రలిచ్చిన ప్రియుడు..యువతికి ఏమైందంటే..?
women safety: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధిలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. వివాహం కాలేదంటూ నమ్మించి, మోసగించిన ఓ కామాంధుడి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. నమ్మినవాడే నయవంచన చేయడంతో పాటు, గర్భస్రావం కోసం ఇచ్చిన మాత్రలు వికటించి ప్రాణాలు కోల్పోయిన ఈ ఉదంతం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరానికి చెందిన 30 ఏళ్ల యువతి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పనిచేస్తోంది. సర్దార్ పటేల్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఆమెకు, అదే ప్రాంతంలో ఉంటున్న కృష్ణా జిల్లాకు చెందిన ఆరెపు నాగసాయి (26) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే, అప్పటికే నాగసాయికి వివాహమై ఓ కుమార్తె కూడా ఉందన్న నిజం ఆ యువతికి తెలియదు.
ఈ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే చనువుగా మారి, వారి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. ఈ విషయం తెలిశాక మోసపోయామని గ్రహించేలోపే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. గర్భం దాల్చిన విషయాన్ని దాచిపెట్టాలని భావించిన నాగసాయి దానిని తొలగించుకోవాలంటూ ఆ యువతికి కొన్ని మాత్రలు ఇచ్చాడు. అయితే, వైద్యుల పర్యవేక్షణ లేకుండా వేసుకున్న ఆ అబార్షన్ మాత్రలు తీవ్రంగా వికటించాయి. దీంతో ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.
పరిస్థితి విషమించడంతో గమనించిన హాస్టల్ సహచరులు ఆమెను ఆగస్టు 26న నిజాంపేట రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి మామ ఫిర్యాదు మేరకు ఆగస్టు 27నే కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు భారీగా ఖర్చువుతుండటంతో కుటుంబసభ్యులు సెప్టెంబరు 1న ఆమెను కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి మార్చారు.
అక్కడ వైద్యులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, అప్పటికే విషమించిన ఆరోగ్య పరిస్థితి కారణంగా సెప్టెంబరు 14న ఆ యువతి తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు నాగసాయిని ఇప్పటికే సెప్టెంబరు 9వ తేదీనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శశిధర్ తెలిపారు.




