Hyderabad: జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైన వంశికను అభినందించిన కేటీఆర్!

Hyderabad: జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన నామాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని గూడెపు వంశికను అభినందించిన కేటీఆర్. నవంబర్‌లో జమ్మూ కాశ్మీర్‌లో పోటీలు.

KALEEM, SIRICILLA
Published on: 23 Oct 2026 6:15 PM IST
Hyderabad
X

Hyderabad: జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైన వంశికను అభినందించిన కేటీఆర్!

హైదరాబాద్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని గూడెపు వంశిక జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

శుక్రవారం తెలంగాణ భవన్‌లో వంశికను కలిసిన కేటీఆర్ ఆమెను అభినందించి, జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న గ్రామీణ ప్రాంత విద్యార్థినులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, వంశికకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

అక్టోబర్ 10 నుంచి 13 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో వంశిక అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలతో కూడిన ఉమ్మడి జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె, జట్టును సెమీఫైనల్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. బౌలింగ్‌లోనూ ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకుంది.

వచ్చే నవంబర్ మొదటి వారంలో జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో వంశిక తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదువుకుంటూ జాతీయ స్థాయికి ఎంపిక కావడం నామాపూర్ గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.

వంశిక విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడు కుంట శ్రీనివాస్‌తో పాటు ప్రోత్సాహం అందించిన పాఠశాల ఉపాధ్యాయులను పలువురు అభినందిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ వంశిక సత్తా చాటి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA