Hyderabad: నిమ్స్‌లో నిరుపేద చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు

Hyderabad: హైదరాబాద్ నిమ్స్‌లో 18 మంది నిరుపేద చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించిన లండన్ వైద్య బృందం. అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

ANAND, JAGITYAL
Published on: 12 Sept 2026 10:03 PM IST
Hyderabad
X

Hyderabad: నిమ్స్‌లో నిరుపేద చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు

హైదరాబాద్: లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, జగిత్యాల వాసి డాక్టర్ రమణారావు దన్నపునేని ఆధ్వర్యంలోని లండన్ వైద్య బృందం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో 18 మంది నిరుపేద చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించింది. ఈ విడతలో 200 మంది చిన్నారులకు పరీక్షలు చేయగా, అత్యవసరమైన 18 మందికి ఆపరేషన్లు పూర్తి చేశారు. అందులో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన ఇద్దరు దళిత చిన్నారులు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ రమణారావు బృందాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను ఉచితంగా అందించి చిన్నారులకు పునర్జన్మ నివ్వడం అభినందనీయమన్నారు. 'లిటిల్ హార్ట్ ఫౌండేషన్' ద్వారా రమణారావు గత ఏడేళ్లుగా ఈ సేవలు అందిస్తున్నారని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్, సీఎం సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిమ్స్ చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్ అమరేశ్వరరావు, డాక్టర్ రమణారావులతో కలిసి భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. నిమ్స్, టిమ్స్‌లలో చిన్నారుల గుండె వైద్యం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు సీఎం హామీ ఇచ్చారని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రెడ్డికి సూచించారని వివరించారు. నిరుపేద చిన్నారులను కాపాడుతున్న వైద్య బృందానికి, సహకరిస్తున్న ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL