Nagole: నాగోల్‌లో మహిళ దారుణ హత్య: ఇద్దరు నిందితుల అరెస్ట్

Nagole: డబ్బులు ఇస్తామని నమ్మించి మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతుపై కాలు పెట్టి హత్య చేసిన ఇద్దరు నిందితులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 8 Oct 2026 8:04 PM IST
Nagole
X

Nagole: నాగోల్‌లో మహిళ దారుణ హత్య: ఇద్దరు నిందితుల అరెస్ట్

నాగోల్‌: డబ్బులు ఇస్తామని నమ్మించి ఓ మహిళను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిన కేసును నాగోల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

మృతురాలిని అలకుంట మంగగా గుర్తించారు. నిందితులు పాల్వాయి యెల్లయ్య, ఇరుగుల సీతారామరాజు అలియాస్ రామ్గా పోలీసులు తెలిపారు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. నిందితులు మద్యం తదితర చెడు అలవాట్లకు బానిసలుగా మారారు. కూలీ అడ్డాల వద్ద మహిళలను పరిచయం చేసుకుని.. డబ్బులు ఇస్తామని చెప్పి వారిని ఏకాంత ప్రదేశాలకు తీసుకెళ్లేవారు.

ఈ క్రమంలో సెప్టెంబర్ 28న కామినేని ఆస్పత్రి చౌరస్తా వద్ద మంగను కలిసిన నిందితులు.. మరుసటి రోజు ఆమెను కలవాలని నిర్ణయించుకున్నారు.

పథకం ప్రకారం సెప్టెంబర్ 29న ఉదయం A-1, A-2 కలిసి తన బంధువు వద్ద నుంచి ఐదు వేల రూపాయలు తీసుకున్నారు. అనంతరం మంగకు ఫోన్ చేసి జైపురి కాలనీకి రావాలని చెప్పారు.

నిందితుల మాటలు నమ్మిన మంగ ఉదయం 10 గంటల 22 నిమిషాలకు జైపురి కాలనీకి చేరుకుంది.

అక్కడి నుంచి ఆమెకు ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి.. మద్యం, నీరు తీసుకుని 100 ఫీట్ల రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.

అక్కడ ముగ్గురూ మద్యం సేవించిన అనంతరం.. తనకు డబ్బులు ఇవ్వాలని మంగ అడిగింది. దీంతో నిందితులు ఆమెపై దాడికి పాల్పడ్డారు.

A-1 మంగను కిందపడేయగా.. A-2 ఆమె కాళ్లు పట్టుకున్నాడు. అనంతరం A-1 ఆమె గొంతుపై కాలు పెట్టి బలంగా నొక్కడంతో మంగ స్పృహ కోల్పోయింది.

మంగ మృతి చెందిందని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

కేసు దర్యాప్తులో భాగంగా నాగోల్ పోలీసులు మృతురాలు, నిందితుల కాల్ డేటా రికార్డులు, మొబైల్ టవర్ లొకేషన్లను విశ్లేషించారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నేరానికి పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

తొలుత BNSS సెక్షన్ 194 కింద నమోదైన ఈ కేసును.. నిందితుల వాంగ్మూలాలు, సీజ్ వివరాల ఆధారంగా Cr.No.636/2026లో BNS సెక్షన్ 103(1) కింద హత్య కేసుగా మార్చారు.

ఇద్దరు నిందితులను అక్టోబర్ 8న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాలతో వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

నాగోల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR