Hyderabad: తప్పు అధికారులది.. శిక్ష విద్యార్థులకా? శంషాబాద్ పరిధిలో కలకలం
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికారుల ఘోర నిర్లక్ష్యం నీట్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది.
Hyderabad: తప్పు అధికారులది.. శిక్ష విద్యార్థులకా? శంషాబాద్ పరిధిలో కలకలం
Hyderabad: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీట్ ఎగ్జామ్ లో అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోము అంటూ నిబంధనలు విధించిన అధికారులు పరీక్ష కేంద్రాల అడ్రస్ విషయం తప్పుగా పేర్కొనడం ఆలస్యమైందని పరీక్షకు అనుమతించకపోవడం సమంజసమేనా.
పరీక్షా కేంద్రం అడ్రస్ విషయం తప్పుగా పేర్కొనడం కారణంగా ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనక్కి తిరగాల్సి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాల హైస్కూల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నీట్ ప్రవేశ పరీక్ష కోసం గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని రాజేంద్రనగర్ ఉన్నత పాఠశాల శివరాంపల్లి ఉన్నత పాఠశాల లో అధికారులు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు
రాజేంద్రనగర్ ఉన్నత పాఠశాల కేంద్రానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజేంద్రనగర్ అని పేర్కొన్న అధికారులు జిల్లా పరిషత్ హై స్కూల్ శివరాంపల్లి రాజేంద్రనగర్ కు బదులుగా జిల్లా పరిషత్ హై స్కూల్ శివరాంపల్లి హయత్ నగర్ అని పేర్కొనడం తో విద్యార్థులను అయోమయానికి గురి చేసింది.
జిల్లా పరిషత్ హై స్కూల్ శివరాంపల్లి రాజేంద్రనగర్ అని ఇవ్వాల్సిన చోట జడ్పీహెచ్ఎస్ శివరాంపల్లి హయత్ నగర్ అని హాల్ టికెట్ తో పాటు పరీక్ష కేంద్రం ఏర్పాటుచేసిన బోర్డుపై పేర్కొనడం విద్యార్థులను అయోమయానికి గురిచేసింది.
జడ్పిహెచ్ఎస్ శివరాంపల్లి హయత్ నగర్ అని పేర్కొనడంతో విద్యార్థులు హైదరాబాద్ నగరానికి అటు చివర ఉన్న హయత్ నగర్ కు వెళ్లి అక్కడ అడ్రస్ దొరకపోవడంతో వెతుక్కుంటూ రాజేంద్రనగర్ లోని శివరాంపల్లి కి చేరుకున్నారు.
హయత్ నగర్ నుండి విద్యార్థులు రాజేంద్రనగర్ లోని శివరాంపల్లికి చేరుకునే లోగా సమయం గడిచిపోవడంతో అధికారులు పరీక్ష వ్రాయడానికి అనుమతించలేదు.
ఆలస్యంగా రావడంలో తమ తప్పేమీ లేదని అధికారులు పంపిన హాల్ టికెట్ పై పరీక్షా కేంద్రం పేరు తప్పుగా ఉండటం వల్ల ఇలా జరిగిందని అధికారులను విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రాధేయపడినప్పటికీ ఫలితం లేకపోయింది.
పరీక్షా కేంద్రం అడ్రస్ తప్పుగా రావడంలో తమకేమీ సంబంధం లేదని మండల విద్యాధికారి ఈ సందర్భంగా తెలిపారు. పరీక్ష నిర్వహిస్తున్న నీట్ అధికారులు, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులే పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేయడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ తప్పు ఎవరిదైనాప్పటికీ ఫలితం మాత్రం విద్యార్థులు అనుభవించాల్సి వస్తుంది.




