Hyderabad: హైదరాబాద్‌లో పాలపిట్టలకు విముక్తి.. దసరా వేళ పోలీసుల మెరుపు దాడులు!

Hyderabad: దసరా పండుగ వేళ మూగజీవాలపై అమానుషానికి పాల్పడిన స్వార్థపరుల ఆటను హైదరాబాద్ నగర పోలీసులు కట్టడించారు.

Arun Chilukuri
Published on: 21 Oct 2026 4:32 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో పాలపిట్టలకు విముక్తి.. దసరా వేళ పోలీసుల మెరుపు దాడులు!

Hyderabad: దసరా పండుగ వేళ మూగజీవాలపై అమానుషానికి పాల్పడిన స్వార్థపరుల ఆటను హైదరాబాద్ నగర పోలీసులు కట్టడించారు. పండుగ పేరుతో బోనుల్లో బంధించిన తెలంగాణ రాష్ట్ర పక్షి 'పాలపిట్ట'లకు పోలీసులు విముక్తి కల్పించారు. నగర పౌరుల నుంచి అందిన పక్కా సమాచారంతో మూడు వేర్వేరు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించి మొత్తం నాలుగు పాలపిట్టలను సురక్షితంగా కాపాడినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

విజయదశమి (దసరా) నాడు పాలపిట్టను దర్శించుకోవడం శుభసూచకమనే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వీటిని బంధించి వ్యాపారంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించారు.

లంగర్‌హౌస్ బాపూఘాట్ సమీపంలోని ఆలయం వద్ద రెండు పాలపిట్టలు, ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి దేవాలయం వద్ద ఒక పాలపిట్ట, మంగళ్‌హాట్ బాలాజీనగర్ ఆలయం సమీపంలో మరొక పాలపిట్టను బోనుల్లో బంధించి ఉంచగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బోనుల్లో తీవ్ర యాతనకు గురవుతున్న ఆ నాలుగు పాలపిట్టలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేబీఆర్ పార్క్‌లోని అటవీ శాఖ అధికారులకు భద్రంగా అప్పగించారు. ఈ అక్రమ నిర్బంధానికి పాల్పడిన నిందితులపై అటవీశాఖ అధికారుల సమన్వయంతో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సీపీ కీలక సందేశం:

"స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరాల్సిన పక్షిని పండుగ పేరుతో బంధించి, తిండి, నీరు లేకుండా హింసించడం ఏమాత్రం తగదు. బోనులో బంధించబడిన పక్షి ఆర్తనాదాల్లో శుభం ఎలా కనిపిస్తుంది? జీవుల పట్ల కరుణ చూపడమే నిజమైన భక్తి కానీ, ప్రకృతిని బంధించడం కాదు" అని కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.

వన్యప్రాణులను బంధించినా, హాని తలపెట్టినా వెంటనే అటవీశాఖ/పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.