Hyderabad: సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై సమీక్ష
Hyderabad: సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణీత వ్యవధిలో సమీక్షలు నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు.
Hyderabad: సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై సమీక్ష
హైదరాబాద్: సింగరేణి సంస్థలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నియామకాలు, ప్రమోషన్లు, ఇతర సమస్యలపై నిర్ణీత వ్యవధిలో సమీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. బుధవారం సింగరేణి భవన్‌లో సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, సంస్థ ఉన్నతాధికారులతో కమిషన్ సమీక్ష సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను కమిషన్ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ తగిన చర్యలు తీసుకోవాలని బక్కి వెంకటయ్య సూచించారు. సింగరేణిలోని అన్ని ఏరియాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టర్ల పరిధిలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా చొరవ చూపాలని కోరారు.
సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ సంస్థలో అందరినీ ఒకే కుటుంబంగా భావిస్తూ, అన్ని విషయాల్లో పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నియామకాలు, ప్రమోషన్లలో ఎలాంటి వివక్షకు తావులేకుండా అర్హత కలిగిన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అలాగే భూగర్భ గనుల్లో లైన్‌మెన్, కోల్‌కట్టర్, సపోర్ట్‌మెన్, టింబర్‌మెన్ వంటి కష్టతరమైన విధులు నిర్వహించే కార్మికులకు ప్రోత్సాహకాలు అందించే విధంగా విధివిధానాలు రూపొందించాలని పర్సనల్ విభాగం అధికారులను సీఎండీ ఆదేశించారు.
ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్‌తో పాటు సింగరేణి డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం. తిరుమలరావు, ఉన్నతాధికారులు, లైజన్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




