Hyderabad: హైడ్రా చర్యలతో రూ.1.5 లక్షల కోట్ల భూముల పరిరక్షణ

Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా, న్యాయపోరాటాలతో రూ. 1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములను పరిరక్షించిందని ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు.

KONDAL, SULTANABAD
Updated on: 31 Oct 2026 7:45 PM IST
Hyderabad
X

Hyderabad: హైడ్రా చర్యలతో రూ.1.5 లక్షల కోట్ల భూముల పరిరక్షణ

హైదరాబాద్: రాష్ట్రంలో సుమారు రూ. 1,50,000 కోట్ల విలువైన విలువైన ప్రభుత్వ భూములను, చెరువులను, నాలాలను మరియు పార్కులను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా పరిరక్షించిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్పష్టం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

​రూ. 50 వేల కోట్ల మియాపూర్ భూముల రక్షణ:

మియాపూర్ లోని 550 ఎకరాల ప్రభుత్వ భూమిపై 1997 ప్రత్యేక న్యాయస్థానం, 2003లో హైకోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ ప్రైవేట్ వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. గత 23 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ, పట్టుదలతో న్యాయపోరాటం చేసి, అక్టోబర్ 29న సుప్రీంకోర్టు ద్వారా 20 అప్పీళ్లను కొట్టివేసేలా తీర్పు సాధించామని పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన భూమి ప్రభుత్వానికి దక్కిందన్నారు.

​హైడ్రా చర్యలతో చెరువుల పునరుజ్జీవం:

హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఉప్పల్‌గూడ, శంషాబాద్, కంటోన్మెంట్, రాయదుర్గం వంటి అనేక ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూములను కబ్జాదారుల నుంచి హైడ్రా ద్వారా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఎకరానికి రూ. 100 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూములతో పాటు చెరువులను, నాలాలను కాపాడడం వల్ల ఇటీవలి వర్షాలకు చెరువులన్నీ నిండి కలకలలాడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

​ఇతర కీలక భూముల వివరాలు:

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిరక్షించిన కొన్ని ప్రధాన భూములు:

​ఐఎంజీ భూములు: 850 ఎకరాలు (విలువ రూ. 50,000 కోట్లు)

​మంచిరేవుల గ్రేహౌండ్స్ భూములు: (విలువ రూ. 10,000 కోట్లు)

​సాహెబ్‌నగర్ అటవీ భూములు: (విలువ రూ. 4,000 కోట్లు)

​కొండాపూర్ భూములు: 36 ఎకరాలు (విలువ రూ. 3,600 కోట్లు)

​భద్రాద్రి కొత్తగూడెం అటవీ భూములు: 600 ఎకరాలు

​భూపాల్‌పల్లి అటవీ భూములు: 380 ఎకరాలు

​గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు:

గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, వారి అనుచరులు ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసే కుట్రలు చేశారని విజయ రమణారావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఈ కబ్జాలపై పోరాటం చేసినందుకే కక్షగట్టి ఆయనను జైలుకు పంపారని గుర్తుచేశారు.

ఆనాడు కరోనా సమయంలో రూ. 20,000 కోట్ల భూములను అమ్మివేస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయపరంగా భూములను కాపాడుతుంటే జీర్ణించుకోలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని హరీష్ రావు వైఖరిని తప్పుపట్టారు.

​రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలను మభ్యపెట్టే బీఆర్ఎస్ నాయకుల మాటలను ఎవరూ నమ్మరని విజయ రమణారావు స్పష్టం చేశారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD