Ghatkesar: ఘట్‌కేసర్‌లో హైడ్రా తనిఖీలు.. నాలా ఆక్రమణలపై నిఘా!
Ghatkesar: ఘట్‌కేసర్ జోడిమెట్ల చౌరస్తా వద్ద నాలా ఆక్రమణలపై హైడ్రా గురి.
Ghatkesar: ఘట్‌కేసర్‌లో హైడ్రా తనిఖీలు.. నాలా ఆక్రమణలపై నిఘా!
ఘట్‌కేసర్: మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్-8లో జోడిమెట్ల చౌరస్తా వద్ద మేధా కంపెనీ ఎదురుగా ఉన్న నాలా ఆక్రమణల వ్యవహారం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. నాలా భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి స్థానిక కాలనీవాసులతో కలిసి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో స్పందించిన హైడ్రా అధికారులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.
హైడ్రా డీఎస్పీ మోహన్‌రావు ఆధ్వర్యంలో అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి నాలా పరిధిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడైన మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డి కూడా హైడ్రా అధికారులతో కలిసి నాలా ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఆక్రమణలపై వివరాలు అందించారు. నాలా భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల భవిష్యత్తులో ముంపు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పరిశీలన సందర్భంగా హైడ్రా అధికారులు మాట్లాడుతూ నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ప్రయోజనాలు, నాలాల పరిరక్షణ, వర్షాకాలంలో ముంపు సమస్యల నివారణ కోసం అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతంలోనే ఇరిగేషన్ శాఖ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2025లో అప్పటి పోచారం మున్సిపాలిటీ పరిధిలో సంబంధిత నిర్మాణాలకు HMDA అనుమతులు మంజూరు చేసినప్పటికీ, అనంతరం ఇరిగేషన్ అధికారులు నిర్వహించిన పరిశీలనలో నాలా పరిధిలోనే నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తించారు. జాతీయ రహదారి కల్వర్టుల గుండా ప్రవహించే ఈ నాలా ఫీడర్ ఛానల్‌గా పనిచేస్తోందని, వర్షాకాలంలో భారీగా నీటి ప్రవాహం ఈ నాలా గుండా వెళ్తుందని తమ నివేదికలో పేర్కొన్నారు.
నాలా ఆక్రమణల వల్ల నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడి భవిష్యత్తులో వరద ముప్పు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, 2025 జూలైలో ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అప్పటి పోచారం మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఘట్‌కేసర్ తహసీల్దార్‌కు అధికారిక లేఖ పంపారు. నాలా పరిధిలో నిర్మాణాలకు మంజూరు చేసిన అనుమతులను రద్దు చేయాలని, WALTA చట్టం ప్రకారం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో సూచించారు.
అయితే ఇరిగేషన్ శాఖ హెచ్చరికలు, పర్మిషన్ల రద్దు సిఫార్సులు ఉన్నప్పటికీ నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, కొంత మంది స్థానికులు హైడ్రా ప్రజావాణిని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు నేరుగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించడం స్థానికుల్లో ఆశలు రేకెత్తించింది. పరిశీలనలో మున్సిపల్ ఏఈ విశేష్ నాయక్, పోచారం మాజీ ఉపసర్పంచ్ అకిటి బాల్‌రెడ్డి, రాష్ట్ర గిరిజన నాయకులు జితేందర్ నాయక్, స్థానిక కాలనీవాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నాలా ఆక్రమణలపై హైడ్రా తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే అంశం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.




