Jogipet: జోగిపేట వ్యవసాయ మార్కెట్‌లో సబ్సిడీ జీలుగు విత్తనాల బ్లాక్ దందా!
Jogipet: అందోలు నియోజకవర్గంలో ప్రభుత్వ సబ్సిడీ జీలుగు విత్తనాల అక్రమ దందా వెలుగులోకి, జోగిపేటలో వ్యాపారి వద్ద పట్టుబడిన బస్తాలు, నిలిచిపోయిన విచారణపై రైతుల ఆగ్రహం.
Jogipet: జోగిపేట వ్యవసాయ మార్కెట్‌లో సబ్సిడీ జీలుగు విత్తనాల బ్లాక్ దందా!
Jogipet: రైతాంగానికి సహాయంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సబ్సిడీపై అందజేసే జీలుగు విత్తనాలు అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారుతున్నాయి. అందోలు నియోజకవర్గ పరిధిలో అర్హులైన రైతులకు అందాల్సిన ఈ విత్తనాలు దారి మళ్లి, జోగిపేట కేంద్రంగా బహిరంగ మార్కెట్లో జోరుగా విక్రయమవుతుండడం కలకలం రేపుతోంది.
కొందరు వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి, పరిసర మండలాల రైతులకు కేటాయించిన సబ్సిడీ జీలుగు విత్తనాలను అడ్డదారిలో సేకరించి, జోగిపేటలోని వ్యాపారులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల జోగిపేట వ్యవసాయ మార్కెట్‌లోని ఓ ప్రముఖ వ్యాపారి సుమారు 70 బస్తాల సబ్సిడీ జీలుగు విత్తనాలను అక్రమంగా కొనుగోలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పరిసర మండలాల నుంచి సేకరించిన ఈ లోడును రహస్యంగా జోగిపేట తెచ్చి విక్రయించినట్లు సమాచారం.
పైరవీ కారుల రంగప్రవేశం తో..ఈ అక్రమ విక్రయాలపై పోలీసుల విచారణ తూ. తూ. మంత్రంగా సాగుతోందని ఆరోపణలు వెలువెత్తు తున్నాయి. గత మూడు రోజుల క్రితం..పక్కా సమాచారం అందుకున్న రేగోడు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, జోగిపేటకు వచ్చి సదరు వ్యాపారి ప్రాంగణంలో విచారణ చేపట్టారు.
అయితే, కేవలం విచారణకే పరిమితమైన పోలీసులు ఆ విషయాన్ని అక్కడికే ముగించేసినట్టు సమాచారం. దీనికి కారణం పైరవీకారుడి జోక్యమేనన్నది బహిరంగ రహస్యమే. వాస్తవానికి
ఈ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న దళారులు ఎవరు? ఏ యే మండలాల నుంచి సబ్సిడీ విత్తనాలు ఇక్కడకు చేరాయనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉన్నప్పటికీ.. ఒక పైరవీ కారుల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు.. మరింత లోటుకు వెళ్లకుండా సెటిల్ చేసేసినట్టు ఆరోపణలు వెలువెత్తు తున్నాయి.
పచ్చిరొట్ట ఎరువుగా భూసారాన్ని పెంచే జీలుగు విత్తనాలకు ప్రస్తుతం వ్యవసాయ సీజన్‌లో తీవ్ర డిమాండ్ ఉంది. ప్రభుత్వం 50 శాతానికి పైగా సబ్సిడీతో ఇస్తున్న ఈ విత్తనాలు క్షేత్రస్థాయిలో అసలైన రైతులకు అందకుండా పోతున్నాయి.
గ్రామాల్లోని కొందరు దళారులు కుమ్మక్కై, రైతుల పేర్లతో సబ్సిడీ విత్తనాలను బయటకు తీసి, జోగిపేటలోని వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆ వ్యాపారులు వాటిని అసలైన రైతులకు...రెట్టింపు ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
మండల వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, కేటాయింపుల పరిశీలన లేకపోవడంతోపాటు పైరవీకారుల కు తలొగ్గిన విచారణధికారుల తీరు.ఈ మాఫియాకు కలసివస్తోందని స్థానిక రైతులు మండిపడుతున్నారు.
ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ శాఖాధికారులు, ఉన్నతాధికారులు స్పందించి జోగిపేటలో సాగుతున్న అక్రమ జీలుగు విత్తనాల దందాపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ రైతులు డిమాండ్ చేస్తున్నారు.




