Uppal: ఉప్పల్ బీఆర్ఎస్‌లో చిచ్చు.. ఎమ్మెల్యేపై సీనియర్ నేతల ఫైర్!

Uppal: ఉప్పల్ బీఆర్ఎస్‌లో ముదిరిన అంతర్గత విభేదాలు.

KARUNAKAR, UPPAL
Published on: 7 Jun 2026 7:34 PM IST
Uppal
X

Uppal: ఉప్పల్ బీఆర్ఎస్‌లో చిచ్చు.. ఎమ్మెల్యేపై సీనియర్ నేతల ఫైర్!

ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఉప్పల్ డివిజన్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు సమావేశమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు అరటికాయల భాస్కర్, సంతోష్ రెడ్డి, టంటం వీరేశ్, అన్య వెంకటేష్, సత్యపాల్ రెడ్డి, వేముల వెంకట్ రెడ్డి, మాట్లాడుతూ పార్టీ శ్రేణులను పట్టించుకోవడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

బీఆర్ఎస్‌ను బలోపేతం చేయాల్సిన ప్రజాప్రతినిధి, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం క్షేత్రస్థాయిలో బలపడుతోందన్నారు. ఉప్పల్ డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఒక్కసారి కూడా పాల్గొనలేదని వారు విమర్శించారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా ఉప్పల్ డివిజన్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురై పార్టీని వీడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే ఉప్పల్‌తో పాటు ఇతర డివిజన్లలో కూడా పార్టీకి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకుల కంటే కాంగ్రెస్ నాయకులే ఎక్కువగా కనిపిస్తున్నారని, ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అధిష్ఠానానికి ప్రాధాన్యత తగ్గించి కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం కల్పించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు డివిజన్ కమిటీలను రద్దు చేసినప్పటికీ, అధిష్ఠానం నిర్ణయాలను పక్కనపెట్టి ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు డివిజన్ అధ్యక్ష పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు.

అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరిస్తూ ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని, దీనివల్ల పార్టీ క్రమశిక్షణ దెబ్బతింటోందన్నారు.బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యే అయినప్పటికీ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వాన్ని ప్రజల్లో ప్రస్తావించకుండా, తరచూ తన సోదరుడు బండారి రాజిరెడ్డి పేరును మాత్రమే ముందుకు తీసుకువస్తున్నారని ఆరోపించారు.

పార్టీతో సంబంధం లేని వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన బ్యానర్లలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చి, కేసీఆర్, కేటీఆర్ చిత్రాలను విస్మరించారని వారు విమర్శించారు. ఇది పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు పంపే చర్యగా అభివర్ణించారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో సంబంధం లేకుండానే బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం సీనియర్ నాయకులుగా పనిచేస్తామని, పార్టీ అభివృద్ధి కోసం కృషి కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే వ్యవహార శైలిపై పూర్తి వివరాలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. పార్టీని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించామని, ఉప్పల్‌లో నెలకొన్న పరిస్థితులపై పార్టీ అధిష్ఠానం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story