Hyderabad air pollution: మరో ఢిల్లీగా హైదరాబాద్..? దీపావళి వేళ దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
Hyderabad air pollution: దీపావళి వేడుకల అనంతరం హైదరాబాద్‌లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.
Hyderabad air pollution: మరో ఢిల్లీగా హైదరాబాద్..? దీపావళి వేళ దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
Diwali: ఐటీ హబ్‌గా, దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ ఇప్పుడు ప్రమాదకరమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి, స్వచ్ఛమైన గాలికి చిరునామాగా ఉన్న భాగ్యనగరంలో ప్రస్తుతం పీల్చేందుకు మంచి గాలి కూడా కరువవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యానికి తోడు, తాజాగా దీపావళి సంబరాలు నగరాన్ని మరింత పొగమయం చేశాయి.
పండుగ వేళ నగరవ్యాప్తంగా అర్థరాత్రి దాటినా భారీ ఎత్తున పటాకులు కాల్చడంతో గాలి నాణ్యత దారుణంగా క్షీణించింది. నగర సగటు గాలి నాణ్యత సూచీ తీవ్రంగా పడిపోయి కాలుష్యం 410 పాయింట్లకు చేరింది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ ఏకంగా 600 పాయింట్లు దాటడం కాలుష్య తీవ్రతకు అద్దం పడుతోంది. బంజారాహిల్స్, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, సోమాజిగూడ ప్రాంతాల్లో మోగిన టపాసుల శబ్దాలు, వెలువడిన ధూళి కణాల కారణంగా పొగ దట్టంగా కమ్ముకుంది.దీపావళి రాత్రి 9.30 గంటల సమయంలో నగర సగటు ఏక్యూఐ 509 పాయింట్లకు చేరింది. సాధారణ పరిమితి 60 మైక్రోగ్రాములు ఉండాల్సిన పీఎం2.5 స్థాయి ఏకంగా 392 మైక్రోగ్రాములుగా నమోదైంది. అలాగే 100 మైక్రోగ్రాములు ఉండాల్సిన పీఎం10 స్థాయిలు 326 మైక్రోగ్రాములకు చేరుకున్నాయి. సోమవారం ఉదయానికి నగర సగటు ఏక్యూఐ 160 పాయింట్లుగా నమోదైంది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఊపిరి ఆడనంత తీవ్ర స్థాయికి చేరింది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నివేదికల ప్రకారం...డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల కంటే 66 రెట్లు అధికం. నవంబర్ 9 తెల్లవారుజామున ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో PM2.5 సాంద్రత క్యూబిక్ మీటరుకు ఏకంగా 993 మైక్రోగ్రాములకు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 24 గంటల పరిమితి కంటే ఇది 66 రెట్లు ఎక్కువ. ఆర్.కే. పురంలో 61.6 రెట్లు, వివేక్ విహార్‌లో 58.2 రెట్లు అధికంగా కాలుష్యం నమోదైంది. బురారీ క్రాసింగ్‌లో AQI 441, రోహిణిలో 430 పాయింట్లుగా రికార్డయ్యాక పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.
హైదరాబాద్‌లో నిత్యం పెరిగిపోతున్న వాహనాల రద్దీ, రోడ్లపై పేరుకుపోతున్న ధూళి, నిర్మాణ పనుల దుమ్ము, పారిశ్రామిక రసాయన ఉద్గారాలకు ఈ పండుగ కాలుష్యం జతకావడంతో పరిస్థితి చేయి దాటుతోంది.ప్రభుత్వ యంత్రాంగం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే, అతి త్వరలోనే హైదరాబాద్ కూడా మరో ఢిల్లీలా మారి డేంజర్ జోన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు.




