Medipally: ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ విస్తృత పర్యటన

Medipally: తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సమస్యలపై అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చొరవ.

KARUNAKAR, UPPAL
Published on: 31 May 2026 5:23 PM IST
Medipally
X

Medipally: ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ విస్తృత పర్యటన

మేడిపల్లి: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్‌ పరిధిలోని మేడిపల్లి డివిజన్ వినాయక్‌నగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ ఆదివారం విస్తృత స్థాయి ప్రజా పర్యటన నిర్వహించింది. మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యటనలో మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి స్థానికులతో మమేకమైన నాయకులు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.

పర్యటన సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను బీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నుంచి ఐదు రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని, దీంతో అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని వాపోయారు. వెంటనే స్పందించిన జక్క వెంకట్‌రెడ్డి జలమండలి అధికారులతో మాట్లాడి నీటి సరఫరాను క్రమబద్ధీకరించాలని కోరారు.

అలాగే కాలనీలోని పలుచోట్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతిని నెలల తరబడి అలాగే ఉండటంతో ప్రజలు ప్రమాద భయంతో జీవిస్తున్నారని వివరించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తామని వారు హామీ ఇచ్చారు. పారిశుద్ధ్య సమస్యలు కూడా వినాయక్‌నగర్ ప్రజలను వేధిస్తున్నాయి.

కాలనీలోని అనేక గల్లీలు, ఖాళీ స్థలాలు చెత్త కుప్పలతో నిండిపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోందని, దోమలు, ఈగలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పుగా మారాయని స్థానికులు తెలిపారు. చెత్త కుప్పల కారణంగా పందులు, ఎలుకలు, వీధి కుక్కలు సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు చెత్త తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కూడా పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేయడంలో వివక్ష జరుగుతోందని ఆరోపించారు.

ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వివిధ కారణాలతో తిరస్కరిస్తున్నారని వాపోయారు. ప్రజల సమస్యలపై స్పందించిన మాజీ మేయర్ జక్క వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం వంటి మౌలిక సమస్యల పరిష్కారం కోసం అధికారులపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.

ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్‌రెడ్డి, కొల్తూరి మహేష్, కౌడే పోచయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story