పీర్జాదిగూడ, మేడిపల్లి ప్రజా సమస్యలు పరిష్కరించండి: జోనల్ కమిషనర్‌కు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి వినతి!

Peerzadiguda: పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్లలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ జోనల్ కమిషనర్ రాధిక గుప్తకు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.

KARUNAKAR, UPPAL
Published on: 11 Jun 2026 6:35 AM IST
పీర్జాదిగూడ, మేడిపల్లి ప్రజా సమస్యలు పరిష్కరించండి: జోనల్ కమిషనర్‌కు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి వినతి!
X

పీర్జాదిగూడ, మేడిపల్లి ప్రజా సమస్యలు పరిష్కరించండి: జోనల్ కమిషనర్‌కు మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి వినతి!

మేడిపల్లి: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్లలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధికారులను కోరారు. ఈ మేరకు ఉప్పల్ జోన్ జోనల్ కమిషనర్ రాధిక గుప్త, బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజలకు మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పర్యటనలో భాగంగా పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపురం ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలను సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నామని తెలిపారు.

వర్షాకాలం నేపథ్యంలో కాలనీల్లో చెత్త పేరుకుపోవడం, రోడ్లు క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారుల పరిశుభ్రత కోసం ఆధునిక రోడ్ స్వీపింగ్ యంత్రాలను వినియోగించి, పారిశుద్ధ్య సిబ్బందిని అంతర్గత కాలనీల శుభ్రతపై మరింతగా కేంద్రీకరించాలని సూచించారు. అలాగే గతంలో అమలులో ఉన్న విధంగా ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి నిర్దిష్ట ప్రాంత బాధ్యతలు అప్పగించి జవాబుదారీతనాన్ని పెంచాలని కోరారు. పీర్జాదిగూడ గుట్ట ప్రాంతంలోని ఇరుకైన గల్లీల్లో సీసీ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాలతో మట్టి కొట్టుకుపోయి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నందున తక్షణ సర్వే నిర్వహించి సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, తమ హయాంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, స్ట్రీట్ లైట్లు, మంచినీటి పైప్‌లైన్లు, నల్లా కనెక్షన్లు వంటి అనేక మౌలిక వసతులు కల్పించామని గుర్తుచేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు, పారిశుద్ధ్య సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి ప్రజారోగ్యం, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, దొంతిరి హరిశంకర్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మైనారిటీ అధ్యక్షుడు జిలాని పాషా, ఆకుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story