LB Nagar: జాతీయవాదుల సంగమం: బీజేపీ బలోపేతానికి పూర్వ నేతల పిలుపు!

LB Nagar: నాగోల్‌లో ఓయూ, కేయూ పూర్వ విద్యార్థుల ‘జాతీయవాదుల సంగమం-2026’ ఘనంగా జరిగింది. బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని సునీల్ బన్సల్, ఎన్. రామచంద్రరావు పిలుపునిచ్చారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 3 Nov 2026 11:42 PM IST
LB Nagar
X

LB Nagar: జాతీయవాదుల సంగమం: బీజేపీ బలోపేతానికి పూర్వ నేతల పిలుపు!

ఎల్బీనగర్: ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పూర్వ విద్యార్థుల మహాసంగమం ‘జాతీయవాదుల సంగమం–2026 నాగోల్ లోని ఓ ఫంక్షన్ హల్లో ’ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌, బీజేపీ కర్ణాటక సహ ఇన్‌చార్జి డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెండు విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు పూర్వ విద్యార్థులు, ఏబీవీపీ పాత కార్యకర్తలు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచంద్రరావు మాట్లాడుతూ.. ఏబీవీపీ అంటే జ్ఞానం, శీలం, ఏకత అని పేర్కొన్నారు. దేశాన్ని ప్రేమిస్తూ, దేశం కోసం త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉండే జాతీయవాద భావజాలాన్ని ప్రతి ఒక్కరూ చాటాలని పిలుపునిచ్చారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో వివాదం సందర్భంగా తమపై దాడులు జరిగాయని, కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. ఆ సమయంలో కాసం వెంకటేశ్వర్లు ధైర్యంగా నిలబడి న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు పోరాడారని తెలిపారు. రాబోయే రోజుల్లో వ్యక్తిగత భేదాలు, ఇతర భావజాలాలకు అతీతంగా బీజేపీ బలోపేతానికి పూర్వ విద్యార్థులంతా కృషి చేయాలని కోరారు.

కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థి పరిషత్‌లో దాదాపు 40 ఏళ్లుగా తన ప్రయాణం కొనసాగుతోందన్నారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో నేర్చుకున్న క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు జీవితంలో ఏ రంగంలో ఉన్నా బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు దోహదపడ్డాయని చెప్పారు. ఇన్నేళ్ల తర్వాత పాత కార్యకర్తలను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ మాట్లాడుతూ.. జాతీయవాద భావజాలంతో విద్యార్థి పరిషత్‌లో చేరిన కార్యకర్తలు నేడు వివిధ రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఏబీవీపీలో నేర్చుకున్న విలువలు, అనుభవాలు జీవితాంతం మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పాత కార్యకర్తలందరూ మళ్లీ కలుసుకుంటూ పరస్పర పరిచయాలు, సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR