Jawaharnagar: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలించాలి: ఈటల రాజేందర్!

Jawaharnagar: జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర రెండో రోజు ఘట్‌కేసర్ నుంచి కీసరకు చేరింది.

KARUNAKAR, UPPAL
Published on: 28 Oct 2026 9:05 PM IST
Jawaharnagar
X

Jawaharnagar: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలించాలి: ఈటల రాజేందర్!

Jawaharnagar: బతకడానికి గాలి పీలుస్తాం.. ప్రాణాలు కోల్పోవడానికి కాదు. దాహం తీర్చుకోవడానికి నీళ్లు తాగుతాం.. రోగాల బారిన పడటానికి కాదు! జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు కాలుష్యంతో ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితిపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ గళమెత్తారు.

డంపింగ్‌ యార్డును తరలించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన చేపట్టిన నాలుగు రోజుల పాదయాత్ర రెండో రోజు బుధవారం కొనసాగింది. అన్నోజిగూడ, ఘట్‌కేసర్‌, యంనంపేట, ఇస్మాయిల్‌ ఖాన్‌గూడ, రాంపల్లి, కరీంగూడ, రాంపల్లి దాయారా మీదుగా కీసరకు చేరుకుంది. పాదయాత్రకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. మొత్తం నాలుగు రోజుల్లో 60 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. రాత్రి కీసరలోని మేఘనా కన్వెన్షన్‌లో బస చేయనున్నారు.

25 ఏళ్ల క్రితమే ఎన్‌జీటీని ఆశ్రయించాం

ప్రముఖ పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 25 ఏళ్ల క్రితమే జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు వ్యతిరేకంగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)ని ఆశ్రయించామని తెలిపారు. అప్పట్లో జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌ డంపింగ్‌ యార్డును తొలగించాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తీర్పును అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్‌కు మద్దతు తెలపడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలు పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలని, తాగే నీరు కలుషితం కాకూడదని స్పష్టం చేశారు. డంపింగ్‌ యార్డు నుంచి వెలువడే లీచెట్‌తో నీటి వనరులు కలుషితమవుతున్నాయని, ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బతికే హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని పేర్కొన్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. డంపింగ్‌ యార్డు సమస్యకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. కోర్టు తీర్పులు అమలు కాకుండా ప్రభుత్వం, కాంట్రాక్టర్‌ వ్యవహారాల కారణంగా సమస్య కొనసాగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల జీవితాలతో చెలగాటమాడవద్దని అన్నారు. న్యాయస్థానాల తీర్పులను అమలు చేయడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డంపింగ్‌ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. ఘట్‌కేసర్‌లో రైల్వే వంతెన పూర్తి కాకపోవడంతో ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వెంటనే ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టాలని కోరారు. కాంట్రాక్టర్‌కు నిధులు అందక పనులు ముందుకు సాగడం లేదనే పరిస్థితి ప్రభుత్వ పనితీరును ప్రశ్నించేలా ఉందని విమర్శించారు.

విషతుల్యమవుతున్న వాగులు.. ప్రజలకు కష్టాలు

పాదయాత్రలో భాగంగా స్థానికులు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. పరిసర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమలు వ్యర్థాలను వాగుల్లోకి వదులుతున్నాయని, డంపింగ్‌ యార్డు నుంచి వచ్చే మురుగుతో కలిసి నీటి వనరులు కలుషితమవుతున్నాయని వివరించారు. దుర్వాసన, కలుషిత నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్ద ఎత్తున సంఘీభావం

ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలో ఘట్‌కేసర్‌ డివిజన్‌ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్‌, ఏనుగు సుదర్శన్‌రెడ్డి తదితర నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ కుందారం గణేశ్‌ చారి, మాజీ ఎమ్మెల్యే, భాజపా సీనియర్‌ నాయకురాలు బోడిగ శోభ తదితరులు పాల్గొన్నారు. మెకానిక్‌ సంఘం సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ కళాశాలల విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు మద్దతు తెలిపారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL