Hyderabad: ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు సవరణకు చట్టబద్ధమైన ఆధారం లేదు!

Hyderabad: హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లోని మహాత్మా గాంధీ న్యాయ కళాశాలలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు జరిగింది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 26 July 2026 8:32 PM IST
Hyderabad
X

Hyderabad: ఎస్‌ఐఆర్ (SIR) ఓటరు సవరణకు చట్టబద్ధమైన ఆధారం లేదు!

ఎల్‌బీనగర్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమానికి చట్టబద్ధమైన ఆధారం లేదని విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ జి. రాధారాణి అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ న్యాయ కళాశాలలో నిర్వహించిన "భారత రాజ్యాంగం – లౌకికవాదం, సామాజిక న్యాయం, ఓటింగ్ హక్కులు" అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు.

SIR నిర్వహణకు రాజ్యాంగబద్ధమైన చట్టం లేదని, ఎన్నికల సంఘానికే ఈ ప్రక్రియపై పూర్తి స్పష్టత లేదని ఆమె వ్యాఖ్యానించారు. కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలని సూచిస్తూ, అవసరమైతే ప్రజాస్వామ్య, లౌకికవాద శక్తులు దేశవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ, SIRను వ్యతిరేకించడం తక్షణ అవసరమని అన్నారు. దేశంలోని లౌకికవాదులు, వామపక్ష పార్టీలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో SIR అమలులో భిన్న విధానాలు ఎందుకని ప్రశ్నించారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా SIR పేరుతో కుట్ర జరుగుతోందని ఆరోపించిన పరకాల ప్రభాకర్, కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సభలో పాల్గొన్న వారి సందేహాలకు జస్టిస్ రాధారాణి, పరకాల ప్రభాకర్ సమాధానాలు ఇచ్చారు.

రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకుడు వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కామేష్‌బాబు, డి.ఏ.ఎస్.వి. ప్రసాద్, వెంకటయ్య, తుమ్మల సత్తిరెడ్డి, సంయుక్త, ఎన్. సుదర్శన్ రెడ్డి, ఎన్. అంజయ్య, ఎం. బ్రహ్మచారి, నర్సింహా, బీజేయం రెడ్డి, కట్ట అనసూయ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story