Kadthal: రెండో రోజు ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం - భారీ స్పందన

Kadthal: కడ్తాల్‌లో కొనసాగుతున్న ఐక్యత ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరానికి రెండో రోజు లభించిన విశేష స్పందన. ఉచిత అద్దాలు, శస్త్రచికిత్సలకు ఎంపికైన బాధితులు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 12 Sept 2026 10:01 PM IST
Kadthal
X

Kadthal: రెండో రోజు ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం - భారీ స్పందన

కడ్తాల్: కడ్తాల్ పట్టణంలోని ఎం.బి.ఏ. గార్డెన్‌లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరో మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి రెండో రోజు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. శంకర నేత్రాలయ, చెన్నై వైద్య నిపుణులు నిర్వహిస్తున్న శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.

రెండో రోజు 800 మందికి పైగా శిబిరానికి రాగా, 520 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కంటి అద్దాలు అవసరమైన 290 మందికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. కంటి శుక్లాల సమస్య ఉన్న 26 మందిని ఉచిత శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు

శిబిరాన్ని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. కంటి పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి కంటి సమస్యలతో వచ్చిన వారి వివరాలు, శస్త్రచికిత్సలకు ఎంపికైన వారి పరిస్థితిపై ఆరా తీశారు. శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు.

ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేదలు కంటి వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు, కంటి శుక్లాల శస్త్రచికిత్సలు, తదుపరి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

రెండు రోజుల్లో 1,400 మందికి పైగా ప్రజలు శిబిరాన్ని సందర్శించారని, 870 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 500 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేయగా, 56 మందిని కంటి శుక్లాల శస్త్రచికిత్సలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

“పేదోడి కళ్లలో వెలుగులు నింపడమే మా సేవా సంకల్పం. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సేవా కార్యక్రమాలకు భవిష్యత్తులోనూ ప్రాధాన్యత ఇస్తాం” అని రాఘవేందర్ రెడ్డి అన్నారు.

కంటి పరీక్షలు సెప్టెంబర్ 16 వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు కంటి శుక్లాల సమస్య ఉన్న వారికి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కడ్తాల్ మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవేందర్, రమేష్ యాదవ్, సీనియర్ నాయకులు ర్బాలయ్య గౌడ్, నరసింహ గౌడ్, తల్లోజు రఘు, ఎగిరిశెట్టి లింగం, రచ్చ శ్రీరాములు, నరేందర్ గౌడ్, కొండల్ యాదవ్, శ్రీపతి, శేఖర్, శ్రీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY