Kalwakurthy: ఎమ్మెల్యే సొంత మండలానికే కరువు గుర్తింపు లేదా?: బీఆర్‌ఎస్!

Kalwakurthy: కల్వకుర్తి ఎమ్మెల్యే సొంత మండలమైన తలకొండపల్లిని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని బీఆర్‌ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు వట్టెల శ్రీశైలం యాదవ్ డిమాండ్ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 29 Oct 2026 9:58 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: ఎమ్మెల్యే సొంత మండలానికే కరువు గుర్తింపు లేదా?: బీఆర్‌ఎస్!

కల్వకుర్తి: కల్వకుర్తి ఎమ్మెల్యే సొంత మండలమైన తలకొండపల్లిలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో ఆ మండలానికి చోటు కల్పించకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు వట్టెల శ్రీశైలం యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్, కడ్తాల్, మాడుగుల మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిందని, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సొంత మండలమైన తలకొండపల్లిని జాబితాలో చేర్చకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే సొంత మండలంలో కరువు పరిస్థితులను అధికారులు గుర్తించలేకపోయారా? లేక క్షేత్రస్థాయి పరిశీలనలో లోపాలు జరిగాయా?" అని నిలదీశారు.

తలకొండపల్లి మండలంలో ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు సాగు చేశారు? ఎల్ నినో ప్రభావంతో ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయాయి? భూగర్భ జలాలు ఎంతమేర అడుగంటాయి? విద్యుత్ సమస్యలు సాగుపై ఎలాంటి ప్రభావం చూపాయి? అనే అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారా అని ప్రశ్నించారు. రైతుల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా నివేదికలు సమర్పించడం వల్లే తలకొండపల్లి మండలానికి కరువు మండలాల జాబితాలో చోటు దక్కలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.

ఒకే నియోజకవర్గంలో, పక్కపక్కనే ఉన్న మండలాల పరిస్థితుల్లో ఇంత వ్యత్యాసం ఎలా వచ్చిందో అధికారులు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.తలకొండపల్లి మండలంలోని వాస్తవ కరువు పరిస్థితులను మరోసారి సమగ్రంగా పరిశీలించి, పంట నష్టాన్ని అంచనా వేసి, అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు వట్టెల శ్రీశైలం యాదవ్ డిమాండ్ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY