Ghatkesar: గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!

Ghatkesar: ఘట్‌కేసర్, కాప్రా ఎక్సైజ్ అధికారుల సంయుక్త దాడుల్లో ఐదుగురు గంజాయి విక్రేతలు పట్టుబడ్డారు.

KARUNAKAR, UPPAL
Published on: 15 Jun 2026 12:42 PM IST
Ghatkesar
X

Ghatkesar: గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!

ఘట్‌ కేసర్: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రత్యేక ఎన్‌డీపీఎస్ డ్రైవ్‌లో భాగంగా కాప్రా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వరుస దాడుల్లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొత్తం 2.075 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ జూపల్లి రవి ప్రస్తుతం కాప్రా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అధికారులు దాడులు చేపట్టారు.

మొదటి ఘటనలో జవహర్‌నగర్ అంబేద్కర్ నగర్ పరిధిలోని టీజీఎస్‌ఆర్టీసీ న్యూ స్క్రాప్ యార్డ్ సమీపంలో ఎక్సైజ్ సిబ్బంది నిఘా నిర్వహించారు. అనుమానాస్పదంగా వచ్చిన సుజుకి బర్గ్‌మాన్ ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా షేక్ సల్మాన్ అలియాస్ సలీమ్ (25), సెమంగుల రఘు (24), మారిపల్లి మహేష్ (23)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రెండు సంచుల్లో నుంచి 1.365 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం, మూడు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నాగ్‌పూర్ నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.

మరో ఘటనలో ఈసీఐఎల్ సాకేత్ రోడ్‌లోని అనీష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ సమీపంలో ఎక్సైజ్ సిబ్బంది నిఘా నిర్వహించి శయ్యద్ షఫీక్ (23), మహమ్మద్ షర్ఫుద్దీన్ (24)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న అడిడాస్ బ్యాక్‌ప్యాక్‌ను తనిఖీ చేయగా 710 గ్రాముల డ్రై గంజాయి లభించింది.

ఈ గంజాయిని కూడా నాగ్‌పూర్ నుంచి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలినట్లు అధికారులు తెలిపారు.రెండు కేసుల్లో కలిపి మొత్తం 2.075 కిలోల డ్రై గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, మూడు మొబైల్ ఫోన్లు, ఒక బ్యాక్‌ప్యాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story