Malkajgiri: మల్కాజిగిరి ఆత్మలింగ మహాగణపతి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు!
Malkajgiri: కార్తీక పౌర్ణమి సందర్భంగా మల్కాజిగిరిలోని ఆత్మలింగ మహాగణపతి దేవస్థానంలో మంగళవారం రుద్ర హోమం, కల్యాణోత్సవం, జ్వాలాతోరణం ఘనంగా జరిగాయి.
Malkajgiri: మల్కాజిగిరి ఆత్మలింగ మహాగణపతి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు!
మల్కాజిగిరి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మల్కాజిగిరిలోని ఆత్మలింగ మహాగణపతి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు శివశర్మ ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ పర్యవేక్షణలో ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించిన అనంతరం రుద్ర హోమం, పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించారు.
సాయంత్రం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ అనంతరం అరుణాచల దీపోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జ్వాలాతోరణం కార్యక్రమాన్ని వైభవంగా జరిపి, ఆకాశదీపాన్ని వెలిగించడంతో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిపారవశ్యంతో ముగిశాయి.
ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ సభ్యులతో పాటు స్థానిక భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.




