KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్-వే.. జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం.!

KBR Park: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు..

G Krishna
Published on: 5 Oct 2026 1:42 PM IST
KBR Park
X

KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్-వే.. జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం.!

KBR Park: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టు రూపకల్పనలో కీలక మార్పులు చేస్తూ నూతన ప్రణాళికకు అధికారులు ఆమోదం తెలిపారు.

ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారికంగా మీడియాకు వెల్లడించారు. కొన్ని న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసుల కారణంగా పాత డిజైన్‌లో మార్పులు చేయడం అనివార్యమైందని, క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగానే ఈ రీ-అలైన్‌మెంట్ చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.

నాగార్జున సర్కిల్ నుంచి చెక్‌పోస్ట్ వరకు 'స్టీల్ ఫ్లైఓవర్'.. ఏడాదే గడువు

కొత్త ప్రణాళిక ప్రకారం, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు రాకపోకలను సులభతరం చేసేందుకు ఒకే భారీ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. నాగార్జున సర్కిల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు అత్యాధునిక సాంకేతికతతో స్టీల్ ఫ్లైఓవర్ (Steel Flyover) నిర్మించబోతున్నామని, పనులను వేగవంతం చేసి సరిగ్గా ఏడాది వ్యవధిలోనే దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని కమిషనర్ ప్రకటించారు. దీనికి అనుబంధంగా అవసరమైన ప్రాంతాల్లో మాత్రమే అండర్‌పాస్‌లు, బ్రిడ్జి పనులను పూర్తిస్థాయిలో చేపడుతున్నామని వివరించారు.

రూ.400 కోట్ల ప్రజాధనం ఆదా.. శాశ్వతంగా వన్-వే విధానం

కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయోగాత్మకంగా అమలు చేసిన సింగిల్ వే (వన్-వే), ఫ్రీ లెఫ్ట్ విధానం వాహనదారులకు ఎంతగానో ఉపయోగపడిందని, రద్దీని తగ్గించడంలో ఇది అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని కమిషనర్ తెలిపారు. ప్రజల నుంచి కూడా దీనిపై విపరీతమైన ఆమోదం రావడంతో ఈ వన్-వే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ప్రాజెక్టులో చేసిన ఈ నూతన మార్పుల వల్ల జీహెచ్‌ఎంసీకి, ప్రభుత్వానికి ఏకంగా రూ.400 కోట్ల వరకు ప్రజాధనం ఆదా అవుతుందని వెల్లడించారు. తక్కువ వ్యయంతో, వేగవంతమైన నిర్మాణాలతో నగరంలో వాహనాల రాకపోకలను శాశ్వతంగా క్రమబద్ధీకరించడమే జీహెచ్‌ఎంసీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.