LB Nagar: యూత్ కాంగ్రెస్ నేత విద్యారెడ్డిపై వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు
LB Nagar: తన కులాన్ని దూషిస్తూ, స్పా సెంటర్లంటూ నిరాధార ఆరోపణలు చేసిన కొత్త విద్యారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం ఏసీపీకి కేతావత్ రమేష్ నాయక్ ఫిర్యాదు.
LB Nagar: యూత్ కాంగ్రెస్ నేత విద్యారెడ్డిపై వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు
LB Nagar: కులం పేరుతో తనను అవమానిస్తూ.. తన వ్యక్తిత్వాన్ని, కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు కేతావత్ రమేష్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ నాయకురాలు కొత్త విద్యారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వనస్థలిపురం ఏసీపీకి ఫిర్యాదు చేశారు.
గత 16 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నానని, ఇటీవల వరకు ఎల్‌బీనగర్ నియోజకవర్గ ST సెల్ అధ్యక్షుడిగా ఉన్నానని రమేష్ తెలిపారు. నెల రోజుల క్రితం తనను సాహెబ్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి నియమించారని చెప్పారు.
నన్ను లంబాడి కులానికి చెందిన వ్యక్తినని తెలిసి కూడా అవమానకరంగా మాట్లాడుతున్నారు నా కులాన్ని ప్రస్తావిస్తూ ఇతరుల వద్ద కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు” అని రమేష్ ఆరోపించారు.
స్పా సెంటర్లు నడుపుతున్నాడు..వ్యభిచారం చేయిస్తున్నాడు’ అంటూ ఆరోపణలు
ఈ నెల 21, 22 తేదీల్లో పలు మీడియా ఛానళ్లలో తనపై తీవ్రంగా అవమానించేలా మాట్లాడారని రమేష్ పేర్కొన్నారు. తనకు నాలుగు, ఐదు స్పా సెంటర్లు ఉన్నాయని, వాటిలో అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నానని విద్యారెడ్డి ఆరోపించారని తెలిపారు.
“నాకు ఒక్క స్పా సెంటర్ కూడా లేదు. నా గురించి చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. రాజకీయంగా నా ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారు” అని ఆయన అన్నారు.
సోషల్ మీడియాలో పరువుతీసే ప్రయత్నం
తన ఫొటోను స్పా సెంటర్ల ఫొటోలతోపాటు, పార్టీ నాయకుల చిత్రాలతో జతచేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని రమేష్ ఆరోపించారు. ఈ పోస్టులు విస్తృతంగా ప్రచారం కావడంతో తన కుటుంబం, బంధువులు, సామాజిక వర్గం ముందు తీవ్ర అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై గతంలో నమోదైన ఓ కేసును ఆధారాలు లేకపోవడంతో న్యాయస్థానం కొట్టివేసిందని, ప్రస్తుతం తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి
తన కులాన్ని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేయడం, బహిరంగంగా నిరాధార ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో పరువు తీసేలా పోస్టులు పెట్టడం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని రమేష్ కోరారు.
కొత్త విద్యారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీస్) చట్టంలోని వర్తించే నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మీడియా ప్రసారాలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పరిశీలించి వాటి వెనుక ఉన్న వ్యక్తులపై కూడా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.




