Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుని దర్శనానికి వెళ్తున్నారా?.. ఆ చుట్టుపక్కల 12 రోజుల పాటు ట్రాఫిక్ రూట్స్ చేంజ్

Khairatabad Ganesh: వినాయక చవితి వేడుకల్లో భాగంగా అందరి దృష్టిని ఆకర్షించే ఖైరతాబాద్ మహా గణేషుని దర్శనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

CR Reddy
Published on: 12 Sept 2026 7:44 AM IST
Khairatabad Ganesh
X

Khairatabad Ganesh

Khairatabad Ganesh: వినాయక చవితి వేడుకల్లో భాగంగా అందరి దృష్టిని ఆకర్షించే ఖైరతాబాద్ మహా గణేషుని దర్శనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో నగర ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 24వ తేదీ వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కఠిన ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి ఏటా ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్న పోలీసులు, ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను కేటాయించారు.

మళ్లించిన వాహన మార్గాలు.. ప్రత్యామ్నాయ రూట్లు ఇవే

భక్తుల రద్దీని బట్టి పోలీసులు పలు ప్రాంతాలలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. పీవీ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను నిరంకారి జంక్షన్ వైపు పంపిస్తున్నారు. పాత పీఎస్ సైఫాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను రాజ్ దూత్ లైన్ ద్వారా ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తున్నారు. ఇక్బాల్ మినార్ నుంచి ఐమ్యాక్స్ వైపు వెళ్లే వాహనాలు మింట్ కాంపౌండ్ వద్ద సెక్రటేరియట్ ఎక్స్ రోడ్ వైపు వెళ్లాలని సూచించారు. నెక్లెస్ రోటరీ వైపు నుంచి మింట్ కాంపౌండ్ వైపు వచ్చే వాహనాలను సెక్రటేరియట్ జంక్షన్ అలాగే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తున్నారు. నిరంకారి నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ పోస్ట్ ఆఫీస్ వద్ద పాత పీఎస్ సైఫాబాద్ వైపు దారి మళ్లిస్తున్నారు.

ప్రత్యేక పార్కింగ్ స్థలాలు.. ప్రజా రవాణా వినియోగానికి ప్రాధాన్యత

ఖైరతాబాద్ గణేషుని దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పోలీసులు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చేవారు రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ పార్కింగ్ స్థలాలను ఉపయోగించుకోవచ్చు. ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కూడా పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చేవారు విశ్వేశ్వరయ్య భవన్ వద్ద వాహనాలు పార్క్ చేయాలి. ఎలాంటి అత్యవసర సమాచారం కోసమైనా 9010203626 నంబర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.