Kukatpally: ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిలిపివేయాలి: ఎమ్మెల్యే మాధవరం!
Kukatpally: కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉన్న సమయంలో హెచ్ఎండీఏ ట్రక్ పార్క్ భూముల వేలం నిర్వహించడం సరికాదని, తక్షణమే వేలాన్ని నిలిపివేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు.
Kukatpally: ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిలిపివేయాలి: ఎమ్మెల్యే మాధవరం!
కూకట్పల్లి: ట్రక్ పార్క్ భూముల వేలాన్ని నిలిపివేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఆస్తులను కాపాడేందుకు నిరాహార దీక్ష చేపట్టడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ హెచ్ఎండీఏ వేలం ప్రక్రియను కొనసాగిస్తోందని విమర్శించారు.
కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉన్న సమయంలో వేలం నిర్వహించడం సరికాదని, న్యాయస్థానం తుది నిర్ణయం వెలువరించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని అన్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ట్రక్ పార్క్ భూములు భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడతాయని, వాటిని నిరుపయోగ భూములుగా పేర్కొంటూ విక్రయించడం తగదని అన్నారు.
ఈ భూములపై ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. ట్రక్ పార్క్ భూములపై నిర్ణయం తీసుకునేందుకు నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.
వేలంలో పాల్గొని భూములు కొనుగోలు చేసే బిల్డర్లు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, ట్రక్ పార్క్ భూముల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తానని మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు.




