Kukatpally: కాంగ్రెస్ హామీలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్!
Kukatpally: కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను నెరవేర్చలేదని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో మంత్రి పొంగులేటి అవకతవకలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆరోపించారు.
Kukatpally: కాంగ్రెస్ హామీలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్!
Kukatpally: కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా హామీలను నెరవేర్చలేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మూసాపేటలో మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ రూ.4 వేల పింఛన్, ఇందిరమ్మ ఇళ్ల వంటి హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆరోపించారు. సొంత నియోజకవర్గానికి కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన వారికి ఇళ్లు కేటాయించినట్లు ఆధారాలతో సహా చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
బయటి నియోజకవర్గాల వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినట్లు నిరూపిస్తే మంత్రి పొంగులేటి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.




