Rangareddy: పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కేటాయించండి: లక్ష్మీ నర్సింహ రెడ్డి

Rangareddy: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావును బీఆర్ఎస్ నేత లక్ష్మీ నర్సింహ రెడ్డి కోరారు.

RAJESH,	WEST ZONE
Published on: 6 Nov 2026 7:23 PM IST
Rangareddy
X

Rangareddy: పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కేటాయించండి: లక్ష్మీ నర్సింహ రెడ్డి

రంగారెడ్డి: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు గూడూరు లక్ష్మీ నర్సింహ రెడ్డి పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని హరీష్ రావును కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న తన రాజకీయ ప్రస్థానాన్ని, ప్రజా జీవితంలో నిర్వహించిన వివిధ బాధ్యతలను ఆయనకు వివరించారు.

గతంలో సర్పంచిగా, తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో పాటు, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుగా పార్టీ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్తున్న విషయాన్ని వివరించారు.

పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగ యువత సమస్యలు, విద్యావ్యవస్థలో నెలకొన్న సవాళ్లు, ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్సీగా తన గొంతుకను వినిపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

పట్టభద్రుల హక్కుల పరిరక్షణ, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యారంగ అభివృద్ధి తన ప్రధాన ప్రాధాన్యతలుగా ఉంటాయని పేర్కొంటూ, పార్టీ నాయకత్వం తనకు అవకాశం కల్పించాలని లక్ష్మీ నర్సింహ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా హరీష్ రావు సానుకూలంగా స్పందించి పార్టీలో చర్చించిన తరవాత నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్లు పేర్కొన్నారు. హరీష్ రావును కలిసిన వారిలో బీఆర్ఎస్ యూత్ వింగ్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేశని మహేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కంబాల పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE