LB Nagar: ఎల్‌బీనగర్‌లో విద్యార్థినులకు 'ధీరా' అవగాహన సదస్సు!

LB Nagar: ఎల్‌బీనగర్ సాంఘిక సంక్షేమ మహిళా లా కాలేజీలో ‘ధీరా’ సదస్సు జరిగింది. విద్యార్థినులకు మహిళా భద్రత, చట్టాలు, ఆత్మరక్షణ కరాటే మెళకువలపై పోలీసులు శిక్షణ ఇచ్చారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 3 Nov 2026 11:45 PM IST
LB Nagar
X

LB Nagar: ఎల్‌బీనగర్‌లో విద్యార్థినులకు 'ధీరా' అవగాహన సదస్సు!

ఎల్‌బీనగర్: మహిళలు భయపడకుండా ధైర్యంగా ఉండాలని.. ప్రతి విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఎల్‌బీనగర్ డీసీపీ బి. అనూరాధ పిలుపునిచ్చారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా న్యాయ కళాశాలలో మహిళా భద్రత, ఆత్మరక్షణపై ధీరా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ బి. అనూరాధ మాట్లాడుతూ.. ఆపద సమయంలో మహిళలు ఏమాత్రం భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 నంబర్లకు ఫోన్ చేయాలని, షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490617444 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు, వ్యక్తిగత ఫొటోల షేరింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలు ఎదురైతే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

అనంతరం డీసీపీ టి. ఉషారాణి షీ టీమ్స్ పనితీరు, భరోసా కేంద్రాల సేవలను వివరించారు. అంతర్జాతీయ కరాటే కోచ్ హన్షి వసంత్ కుమార్ విద్యార్థినులకు కరాటే మెళకువలు, ఆత్మరక్షణ పద్ధతులపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్స్ డా. ఎం. మానస, డా. హెచ్. రాధిక తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR