LB Nagar: సింగరేణి కాలనీలో వైభవంగా తీజ్ వేడుకలు – హాజరైన కల్వకుంట్ల కవిత

LB Nagar: ఎల్బీనగర్ సింగరేణి కాలనీలో బంజారా సమాజం ఆధ్వర్యంలో ఘనంగా తీజ్ వేడుకలు. బంజారా మహిళలతో కలిసి పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 23 Aug 2026 8:38 PM IST
LB Nagar
X

LB Nagar: సింగరేణి కాలనీలో వైభవంగా తీజ్ వేడుకలు – హాజరైన కల్వకుంట్ల కవిత

ఎల్బీనగర్: సింగరేణి కాలనీలో బంజారా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భారీ వర్షం కురుస్తున్నా బంజారా మహిళలు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వేడుకల ప్రాంగణం జనసంద్రంగా మారింది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై బంజారా మహిళలతో కలిసి తీజ్ వేడుకల్లో పాల్గొన్నారు.

బంజారా మహిళలతో కలిసి గోధుమ నారు బుట్టను తలపై పెట్టుకున్న కవిత తీజ్ శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. కవిత ప్రసంగిస్తున్న సమయంలో బంజారా మహిళలు, యువత ‘సీఎం.. సీఎం..’ అంటూ నినాదాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అధికారంలోకి వస్తే.. తీజ్‌కు అధికారిక గుర్తింపు!

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే తీజ్ పండుగను అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. బంజారా మహిళలు కోరుతున్నట్లుగా తీజ్ సందర్భంగా మూడు రోజుల సెలవులు కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కవిత అన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడం నుంచి తీజ్ పండుగను కొనసాగించడం వరకు బంజారా ఆడబిడ్డలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

“తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉండి.. నేలపై నిద్రిస్తూ బంజారా సంస్కృతిని కాపాడుతున్నారు. తీజ్ పండుగ ప్రాశస్త్యాన్ని నిలబెడుతున్నది కూడా మన ఆడబిడ్డలే” అని కవిత పేర్కొన్నారు.

30 ఏళ్లుగా సింగరేణి కాలనీ పరిస్థితి మారలేదన్న కవిత

సింగరేణి కాలనీలో గత 30 ఏళ్లుగా పెద్దగా మార్పు కనిపించడం లేదని కవిత విమర్శించారు. గుడిసెలు అలాగే ఉన్నాయని, మురుగు కాల్వల సమస్యలు కొనసాగుతున్నాయని, ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని అన్నారు.

ఈ పరిస్థితిని మార్చేందుకే సామాజిక న్యాయ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆగస్టు 6న హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ సభ ద్వారా సమాజంలో మార్పు కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి

అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని, ప్రతి వర్గం సంస్కృతి, సంప్రదాయాలు కాపాడబడాలని కవిత అన్నారు. బంజారా బిడ్డలతో తెలంగాణ రక్షణ సేనకు ఎంతో అనుబంధం ఉందని, ఆ అనుబంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

భారీ వర్షంలోనూ తీజ్ వేడుకలకు బంజారాలు భారీగా తరలిరావడంపై కవిత ప్రశంసలు కురిపించారు. “ఇంత వర్షం పడుతున్నా మీరు కదలకుండా ఉన్నారంటే మీ ధైర్యం, పట్టుదల ఏంటో అర్థమవుతోంది” అని అన్నారు. చివరగా.. “మీ సంస్కృతికి మీరు ఇస్తున్న గౌరవాన్ని ఇలాగే కొనసాగించండి. తెలంగాణ రక్షణ సేనతోనే సామాజిక న్యాయ తెలంగాణ సాధ్యమవుతుంది” అని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story