LB Nagar: మీ సేవలో పోలీస్ స్టేషనా? కాలనీవాసుల తీవ్ర ఆగ్రహం

LB Nagar: ఎల్బీనగర్ పరిధిలోని వికాస్‌నగర్ మీ సేవ కేంద్రాన్ని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌గా మార్చడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 29 May 2026 2:31 PM IST
LB Nagar
X

LB Nagar: మీ సేవలో పోలీస్ స్టేషనా? కాలనీవాసుల తీవ్ర ఆగ్రహం

LB Nagar: చైతన్యపురి డివిజన్ వికాస్‌నగర్‌లోని మీ సేవ కేంద్రంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, న్యూ దిల్‌సుఖ్‌నగర్ కమ్యూనిటీ హాల్‌ను మీ సేవ కార్యాలయానికి కేటాయించాలనే జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. వికాస్‌నగర్ మీ సేవ కేంద్రం వద్ద జరిగిన ధర్నాకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మద్దతు తెలిపారు.

ఎమ్మెల్యే ఆగ్రహం: ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఆ భవనంలో మీ సేవ కేంద్రం, గ్రంథాలయం, వార్డు కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వాటిని తొలగించి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనిపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు" అని అన్నారు.

"పోలీస్ స్టేషన్ వల్ల ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు పెరిగి కాలనీవాసులు ఇబ్బందులు పడతారు. ప్రజలకు సేవలందిస్తున్న కార్యాలయాలను తొలగించడం సమంజసం కాదు" అని ఆయన పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్‌కు అన్యాయం: "న్యూ దిల్‌సుఖ్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో సీనియర్ సిటిజన్స్ భవనం కొనసాగుతోంది. దాన్ని మీ సేవకు కేటాయిస్తే వృద్ధులు ఉదయం, సాయంత్రం కాలక్షేపం చేసేందుకు స్థలం లేకుండా పోతుంది. ఆ భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇతర అవసరాలకు ఇవ్వకూడదు" అని డిమాండ్ చేశారు.

అప్పట్లో కేటాయించిన స్థలం ఏమైంది?: "గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో పోలీస్ స్టేషన్ కోసం 3000 గజాల స్థలం కేటాయించాం. అక్కడ నిర్మాణం చేపట్టకుండా ప్రజలకు ఉపయోగపడుతున్న భవనాలను ఖాళీ చేయించడం సరికాదు" అని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు పునరాలోచించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, త్రివేది, నర్సిరెడ్డి, శివప్రకాష్, నాగలక్ష్మి, న్యూ దిల్‌సుఖ్‌నగర్ కాలనీవాసులు సుష్మిత, రోజా పద్మిని, భవాని నగర్ కాలనీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, వికాస్‌నగర్ అధ్యక్షులు వెంకటేష్, శోభారాణి, విద్యుత్ నగర్ అధ్యక్షులు శ్రీనివాసచారి, ద్వారకాపురం సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు ప్రసాద్, పవన్ సంతోష్, తులసి కృష్ణ, గట్టు శ్రీను, రమణారెడ్డి, జలంధర్, కిరణ్, నరేష్, శ్రీధర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story