LB Nagar: ఎల్బీనగర్ చెరువుల సుందరీకరణకు మధుయాష్కి గౌడ్ వినతి
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గంలో చెరువుల సుందరీకరణ, బోనాల ఏర్పాట్లపై జోనల్ కమిషనర్ వికాస్ మహాతోతో మధుయాష్కి గౌడ్ భేటీ. సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి.
LB Nagar: ఎల్బీనగర్ చెరువుల సుందరీకరణకు మధుయాష్కి గౌడ్ వినతి
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్, బండ్లగూడ, సాహెబ్‌నగర్ కాప్రాయి చెరువులను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ జోనల్ కమిషనర్ వికాస్ మహాతోను కోరారు. సోమవారం రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, రాగుల వెంకటేశ్వర్‌రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, ముద్దగోని లక్ష్మీప్రసన్న, సుజాత నాయక్, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్‌లతో కలిసి జోనల్ కమిషనర్‌ను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
రానున్న బోనాల పండుగ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, దెబ్బతిన్న రహదారులపై మట్టి వేయాలని కోరారు. ఎల్బీనగర్ ఎల్పీటీ మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రోడ్డుపై నిర్మించిన ఫుట్‌పాత్‌ను సరిచేయాలని సూచించారు. నాగోల్, బండ్లగూడ, సాహెబ్‌నగర్ చెరువుల సుందరీకరణతో పాటు నియోజకవర్గంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
హయత్‌నగర్ పాత గ్రామంలో రోడ్డు విస్తరణ కారణంగా ఇళ్లు, ఆస్తులు కోల్పోతున్న వారికి తగిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలపై జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. రోడ్ల విస్తరణ, నష్టపరిహారం అంశాలపై ప్రతి శనివారం సమావేశం నిర్వహించి బాధితుల సమస్యలను పరిశీలిస్తామని, హయత్‌నగర్ బాధితులకు నష్టపరిహారం అందించే అంశాన్ని చర్చిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చ
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై కూడా మధుయాష్కి గౌడ్ జోనల్ కమిషనర్‌తో చర్చించారు. ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలు పెద్దఎత్తున తిరిగి రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలకు వెళ్లే ఓటర్లను దృష్టిలో ఉంచుకుని బీఎల్వోలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికీ వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బీఎల్ఏలను పంపించి ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగస్వాములను చేస్తున్నామని, ఓటరు నమోదు శాతం పెంచేందుకు పార్టీ పరంగా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.




