LB Nagar: రంగారెడ్డి జిల్లా లోక్ అదాలత్‌లో 1.65 లక్షల కేసులు పరిష్కారం!

LB Nagar: రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1.65 లక్షలకు పైగా కేసులు పరిష్కారం. కక్షిదారులకు రూ.10 కోట్లకు పైగా పరిహారం పంపిణీ.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 13 Sept 2026 11:32 AM IST
LB Nagar
X

LB Nagar: రంగారెడ్డి జిల్లా లోక్ అదాలత్‌లో 1.65 లక్షల కేసులు పరిష్కారం!

LB Nagar: రంగారెడ్డి జిల్లా పరిధిలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 1,65,000కుపైగా కేసులు పరిష్కరించినట్లు న్యాయశాఖ అధికారులు తెలిపారు. రాజీకి అనుకూలమైన క్రిమినల్‌, సివిల్‌, చెక్‌ బౌన్స్‌, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ, ప్రీ-లిటిగేషన్‌ తదితర కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించారు.

జిల్లా వ్యాప్తంగా 33 లోక్‌ అదాలత్‌ బెంచ్‌లను ఏర్పాటు చేసి కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, DLSA చైర్మన్‌ శ్రీ కర్ణ కుమార్‌, I ADJ శ్రీ వినోద్ కుమార్‌, IV ADJ శ్రీ కె. జయరాం రెడ్డి, DLSA కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీ పి. పవన్ కుమార్‌తో పాటు పలువురు సీనియర్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జీలు పాల్గొన్నారు.

కలిసిన దంపతులు

విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన ఓ దంపతులకు లోక్‌ అదాలత్‌ సందర్భంగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కౌన్సెలింగ్‌తో వారి మధ్య ఉన్న మనస్పర్థలు తొలగి, తిరిగి కలిసి జీవించేందుకు అంగీకరించారు. దీంతో ఓ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా కాపాడినట్లయింది.

ప్రమాద బాధితులకు రూ.80 లక్షల పరిహారం

మోటారు వాహన ప్రమాద కేసుల్లో బాధితులకు శ్రీరామ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, HDFC ERGO జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల ద్వారా రూ.80 లక్షల నష్టపరిహారం ఇప్పించారు.

జిల్లా వ్యాప్తంగా పరిష్కరించిన అన్ని కేసులకు సంబంధించి కక్షిదారులకు మొత్తం రూ.10,03,33,111 నష్టపరిహారం అందించినట్లు అధికారులు వెల్లడించారు.

జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు, ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రతినిధులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ప్యానెల్‌ న్యాయవాదులు, DLSA సిబ్బంది, ఇతర సంబంధిత అధికారులు సహకరించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR