Uppal: ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ బ్లాక్ టికెట్ల ముఠా గుట్టురట్టు
Uppal: హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరగనున్న SRH vs RCB ఐపీఎల్ మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఛేదించారు.
Uppal: ఉప్పల్ స్టేడియం వద్ద ఐపీఎల్ బ్లాక్ టికెట్ల ముఠా గుట్టురట్టు
ఉప్పల్: హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బ్లాక్ టికెట్ల దందా వెలుగులోకి వచ్చింది. మ్యాచ్‌కు భారీ డిమాండ్ ఉండటాన్ని అవకాశంగా మార్చుకున్న కొందరు వ్యక్తులు కాంప్లిమెంటరీ టికెట్లను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి స్టేడియం పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పలువురు అభిమానులకు అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన కాంప్లిమెంటరీ టికెట్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉచితంగా ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ టికెట్లను వేల రూపాయలకు విక్రయిస్తూ అభిమానులను మోసం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కాంప్లిమెంటరీ టికెట్లు నిందితుల వద్దకు ఎలా వచ్చాయి..? వీటి వెనుక ఇంకెవరైనా ఉన్నారా..? ఈ బ్లాక్ టికెట్ల దందా ఎప్పటి నుంచి కొనసాగుతోంది..? అనే కోణాల్లో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
మ్యాచ్‌ల సమయంలో అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




