LB Nagar: మన్సూరాబాద్ యూపీహెచ్సీలో 'ఆపరేషన్ కోడ్ బ్లూ' తనిఖీలు!
LB Nagar: మన్సూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అపరిశుభ్రతపై టీఆర్ఎస్ నేతల ఆకస్మిక తనిఖీ. సమస్యలు పరిష్కరించకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక.
LB Nagar: మన్సూరాబాద్ యూపీహెచ్సీలో 'ఆపరేషన్ కోడ్ బ్లూ' తనిఖీలు!
LB Nagar: మన్సూరాబాద్ అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో అపరిశుభ్రత, కనీస వైద్య సదుపాయాల కొరతపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ కోడ్ బ్లూ’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు, ఉద్యమకారుడు ఏలుకొండ రాంకోటి ప్రజాపతి ఆధ్వర్యంలో నాయకులు ఆసుపత్రిని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
ఆసుపత్రి పరిసరాలు చెత్తా చెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లు తున్నాయని, రోగులకు సరిపడా వైద్య సదుపాయాలు అందుబాటులో లేవని నాయకులు ఆరోపించారు. వైద్యులు, నర్సుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
రోగులకు ఎక్స్ రే తీసిన అనంతరం ఫిల్మ్ ఇవ్వకుండా, ఫోన్ లో ఫొటో తీసుకోవాలని సూచిస్తున్నట్లు రోగులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఆసుపత్రి ల్యాబ్ పరిసరాల్లో ఎలుకలు, బల్లులు కనిపించడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితి పై సంబంధిత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి
( డీ ఎం హెచ్ ఓ )కు ఫోన్ చేసి వివరించినట్లు రాంకోటి ప్రజాపతి తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. చిన్నపాటి అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే ప్రజలు, ఇక్కడి అపరిశుభ్రత ను చూసి మరింత ఆందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేసి, అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలి. వైద్యులు, నర్సుల కొరతను పరిష్కరించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొప్పు అర్జున్, డివిజన్ నాయకులు బల్లెం గిరి, లింగం యాదవ్, వెంకన్న శివ, విద్యార్థి నాయకులు వొగోటి శేఖర్, మంచాల వంశీ చారి తదితరులు పాల్గొన్నారు.




