Hyderabad: మాదాపూర్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సైబరాబాద్ సీపీ
Hyderabad: మాదాపూర్ లా & ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మర్యాదగా ప్రవర్తించాలని ఆదేశం.
Hyderabad: మాదాపూర్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సైబరాబాద్ సీపీ
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లను సందర్శించి అక్కడి మౌలిక సదుపాయాలు, ప్రజలకు అందిస్తున్న సేవలు, ట్రాఫిక్ నిర్వహణ విధానం, పోలీసు సిబ్బంది పనితీరును సమీక్షించారు.
స్టేషన్ పరిసరాలను పరిశీలించిన సీపీ, ప్రజలకు మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్ అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్ నిర్వహణ చేపట్టి, వాహనదారులు మరియు పాదచారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే స్టేషన్‌లలో మౌలిక వసతులను సక్రమంగా నిర్వహిస్తూ, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో వేగం, సిబ్బంది సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సీపీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (TTI)ను కూడా సందర్శించిన సీపీ, ట్రాఫిక్ సిబ్బందికి అందిస్తున్న శిక్షణ విధానాన్ని సమీక్షించారు. విధి నిర్వహణలో వృత్తి నైపుణ్యం, మర్యాదపూర్వక ప్రవర్తన, ప్రజా సేవా దృక్పథానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా వాహనదారులు, ప్రజలతో మర్యాదగా, సంయమనంతో వ్యవహరించాలని, చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తూనే ప్రజల గౌరవాన్ని కాపాడే విధంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి చర్యలో వృత్తిపరమైన నడవడి, పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి పాటించాలని తెలిపారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్, ట్రాఫిక్–I డీసీపీ రవికుమార్, శేరిలింగంపల్లి ట్రాఫిక్ ఏడీసీపీ హనుమంతరావు, మాధాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




