Madhapur: మాదాపూర్‌లో బైక్ అదుపుతప్పి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి
Madhapur: మాదాపూర్ సీఐఐ జంక్షన్ వద్ద బుల్లెట్ బైక్ అదుపుతప్పి డివైడర్, చెట్టును ఢీకొట్టిన ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సుష్మా చౌదరి మృతి; కేసు నమోదు.
Madhapur: మాదాపూర్‌లో బైక్ అదుపుతప్పి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి
మాదాపూర్: నగరంలోని హైటెక్ సిటీ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను, ఆపై చెట్టును ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని ఒక పీజీ హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న సుష్మా చౌదరి కాజాగూడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కొతిలి అక్షయ్ కుమార్ స్నేహితులు. మంగళవారం రాత్రి వీరిద్దరూ మాదాపూర్‌లో నివసిస్తున్న మరో స్నేహితుడు ఉల్లూరి సందీప్ ఇంటికి భోజనానికి వెళ్లారు.
భోజనం ముగించుకున్న అనంతరం బుధవారం తెల్లవారుజామున 12:50 గంటల ప్రాంతంలో అక్షయ్ కుమార్ తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ (AP 31 DZ 6751) వాహనంపై సుష్మాను వెనుక కూర్చోబెట్టుకుని కొండాపూర్ బయలుదేరాడు. తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న పెద్దమ్మ టెంపుల్ సమీపంలో ఉన్న CII జంక్షన్ వద్దకు రాగానే, అక్షయ్ బైక్‌ను అత్యంత నిర్లక్ష్యంగా నడపడంతో వాహనం అదుపుతప్పింది. వేగంగా వెళ్లి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి, ఆపై డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును బలంగా ఢీకొంది.
ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న సుష్మా చౌదరి రోడ్డుపై ఎగిరిపడటంతో ఆమె తలకు, ముఖానికి తీవ్ర గాయాలై అధిక రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను మాదాపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఘటనపై స్నేహితుడు ఉల్లూరి సందీప్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు అక్షయ్ కుమార్‌పై నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.




