Maheshwaram: కొంగరఖుర్దులో నక్షా బాట ధ్వంసం దారి లేక రైతుల తీవ్ర అవస్థలు
Maheshwaram: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరఖుర్దులో పురాతన నక్షా బాట ధ్వంసం. పొలాలకు దారి లేక రైతుల తీవ్ర అవస్థలు, బాటను పునరుద్ధరించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేత.
Maheshwaram: కొంగరఖుర్దులో నక్షా బాట ధ్వంసం దారి లేక రైతుల తీవ్ర అవస్థలు
Maheshwaram: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరఖుర్దు గ్రామంలో రైతుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పురాతన కాలం నుంచి రైతులు ఉపయోగిస్తున్న నక్షా బాటను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామానికి చెందిన రైతులకు సర్వే నంబర్లు 295, 294, 296, 297, 497, 28, 498లలో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములకు వెళ్లడానికి సర్వే నంబర్ 289 గుండా వెళ్లే నక్షా బాటను ఎన్నో ఏళ్లుగా రైతులు ఉపయోగిస్తున్నారు. ఈ బాట ద్వారా ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, పశువుల రాకపోకలు సులువుగా సాగేవి.
బాట ధ్వంసంపై రైతుల ఆరోపణలు
ఇటీవల సర్వే నంబర్లు 291, 292లలో భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు ఆ బాటను చదును చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఆ బాటపై ఫిర్యాదు అందిన సాకుతో రెవెన్యూ అధికారులు ఏకంగా ఆ పురాతన నక్షా బాటను పూర్తిగా ధ్వంసం చేశారని బాధిత రైతులు వాపోతున్నారు.
పొలాలకు వెళ్లే దారి లేక అవస్తలు పడుతున్న రైతులు
బాట ధ్వంసం కావడంతో ప్రస్తుతం తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లోని బర్రెలు, ఇతర పశువులకు గడ్డి తీసుకెళ్లడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్లు, ఇతర వాహనాలు తీసుకెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
కలెక్టర్ ను కోరుతున్న రైతులు
ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. రెవెన్యూ రికార్డులు, పాత నక్షా మరియు క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించి, పురాతన కాలం నుంచి ఉన్న నక్షా బాటను గుర్తించి పునరుద్ధరించి, రైతుల రాకపోకలకు శాశ్వతంగా అందుబాటులోకి తేవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులతో స్థల పరిశీలన జరిపి తక్షణ పరిష్కారం చూపాలని బాధిత రైతులు కోరారు.
ఈ సందర్భంగా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అలేటి బాలయ్య, కోటగళ్ల రాజ్ కుమార్, కోటగళ్ల బాలరాజ్, నిమ్మ దామోదర్ రెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.




