Uppal: ఉప్పల్‌లో భారీ చోరీ: 48 తులాల బంగారం మాయం
Uppal: ఉప్పల్ న్యూ భరత్‌నగర్‌లో తాళం వేసిన ఇంట్లోకి బుర్కా ధరించి చొరబడిన దుండగుడు 48 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.3.5 లక్షల నగదు దోచుకెళ్లాడు.
Uppal: ఉప్పల్‌లో భారీ చోరీ: 48 తులాల బంగారం మాయం
ఉప్పల్: ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు దేవస్థానానికి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగుడు తాళాలు పగలగొట్టి భారీ చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూ భరత్‌నగర్ కాలనీలో జరిగింది. సుమారు 48 తులాల బంగారు ఆభరణాలు, కేజిన్నర వెండి ఆభరణాలతో పాటు రూ.3.5 లక్షల నగదును దుండగుడు అపహరించినట్లు సమాచారం.
న్యూ భరత్ కాలనీకి చెందిన భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులు కొమరవెల్లి దేవస్థానానికి వెళ్లారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో బుర్కా ధరించిన వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. బీరువాను తెరిచి బంగారు, వెండి ఆభరణాలు, నగదును దోచుకెళ్లినట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు నిందితుడు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించిన పనిమనిషి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.
దీంతో వారు ఇంటికి చేరుకుని చూడగా, బీరువా తెరిచి ఉండటంతో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీకి పాల్పడిన వ్యక్తి కదలికలు, తాళాలు పగలగొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు.




