Hyderabad: అంబర్‌పేటలో అగ్నిప్రమాదం.. మహీంద్రా షోరూమ్‌లో ఎగిసిపడుతున్న మంటలు!
Hyderabad: హైదరాబాద్ అంబర్‌పేట్ చే నంబర్ కూడలి వద్ద గల మహీంద్రా షోరూమ్‌లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పక్కన ఉన్న ఇళ్లకు వ్యాపిస్తాయన్న భయంతో నివాసితులను ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
Hyderabad: అంబర్‌పేటలో అగ్నిప్రమాదం.. మహీంద్రా షోరూమ్‌లో ఎగిసిపడుతున్న మంటలు!
Hyderabad: నగరంలోని అంబర్‌పేట్ పరిధిలో సోమవారం (ఏప్రిల్ 27) మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అంబర్‌పేట్ చే నంబర్ కూడలి వద్ద ఉన్న మహీంద్రా కార్ల షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
షోరూమ్ నుండి మంటలు భారీగా ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. ప్రమాదం జరిగిన సమయంలో షోరూమ్‌లో కొత్త కార్లతో పాటు సర్వీసింగ్‌కు వచ్చిన వాహనాలు మరియు ఇతర విడిభాగాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల తీవ్రతను గమనించిన షోరూమ్ సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు.
షోరూమ్ పక్కనే పలు నివాస సముదాయాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలు పక్కన ఉన్న భవనాలకు వ్యాపించే ప్రమాదం ఉన్నందున, ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం, అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




