Medipally: మేడిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం: తప్పిన ప్రాణనష్టం

Medipally: హైదరాబాద్-వరంగల్ హైవే పీర్జాదిగూడ వద్ద మద్యం మత్తులో వేగంగా వచ్చిన ఫార్చ్యూనర్ ఐ10 కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా ప్రాణాపాయం తప్పింది.

KARUNAKAR, UPPAL
Published on: 22 Oct 2026 2:19 PM IST
Medipally
X

Medipally: మేడిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం: తప్పిన ప్రాణనష్టం

మేడిపల్లి: అతివేగం.. మద్యం మత్తు.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వెరసి హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదానికి దారితీశాయి. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడలో, ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌ పిల్లర్‌ నంబర్‌ 57 సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద గురువారం ఉదయం 6.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన టయోటా ఫార్చ్యూనర్‌ కారు ముందుగా వెళ్తున్న ఐ10 కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

దీంతో ఐ10 కారు పల్టీలు కొట్టగా.. అదుపుతప్పిన ఫార్చ్యూనర్‌ రోడ్డుపక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగి ఫార్చ్యూనర్‌ కారుపై పడింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా, ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వెనుక నుంచి ఢీకొట్టడంతో పల్టీలు

మేడిపల్లి సీఐ డి.జలంధర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాయిశివ (30), ఆయన భార్య మేఘన (28) ఐ10 కారులో ఎల్‌బీనగర్‌ నుంచి వరంగల్‌ జిల్లా నర్సంపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పీర్జాదిగూడలోని పిల్లర్‌ నంబర్‌ 57 సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఫార్చ్యూనర్‌ కారు వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఐ10 కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ డివైడర్‌ వైపు వెళ్లింది.

అనంతరం ఫార్చ్యూనర్‌ కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది విరిగి వాహనంపై పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన సాయిశివ, మేఘనను చికిత్స నిమిత్తం చైతన్యపురిలోని ఓజోన్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

మద్యం మత్తు, లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌.. నకిలీ నంబర్‌ ప్లేట్‌

ప్రమాదానికి కారణమైన ఫార్చ్యూనర్‌ కారును అకున్‌ సబర్వాల్‌(29) అనే యువకుడు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అతడు మద్యం సేవించి ఉండటం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని విచారణలో తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా కారుకు అమర్చిన నంబర్‌ ప్లేట్‌ నకిలీదిగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వ్యక్తికి వాహనం నడపడానికి అనుమతించినందుకు కారు యజమాని మంగీలాల్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ డి.జలంధర్‌ రెడ్డి తెలిపారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL