OU: రోస్టర్ సవరించకుంటే సమరమే: మాల సంఘాల జేఏసీ హెచ్చరిక!
OU: ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్లను సవరించే వరకు కొత్త నోటిఫికేషన్లు ఆపాలని, లేదంటే 'నో రోస్టర్ - నో ఓటు' ఉద్యమం చేపడతామని ఓయూలో మాల జేఏసీ హెచ్చరించింది.
OU: రోస్టర్ సవరించకుంటే సమరమే: మాల సంఘాల జేఏసీ హెచ్చరిక!
OU: ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్లను న్యాయబద్ధంగా సవరించే వరకు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపివేయాలని మాల సంఘాల జేఏసీ, మాల స్టూడెంట్స్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రోస్టర్ విధానంలో మార్పులు చేయకుంటే ‘నో రోస్టర్–నో ఓటు’ నినాదంతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ.. గత 18 నెలలుగా మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఈ నెల 4న ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన మాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సభలో రూపొందించిన కార్యాచరణను వెల్లడించారు. మొదటి 20 రోస్టర్ పాయింట్లలో కనీసం రెండు ఎస్సీ గ్రూప్-3కి కేటాయించేలా ప్రభుత్వం జీవోను సవరించాలని కోరారు. గత నియామకాలు, విద్యా ప్రవేశాల్లో ప్రాతినిధ్య లోటును సమీక్షించి, నూతన జోనల్ వ్యవస్థ, క్యాడర్ ప్రాతిపదికన శాస్త్రీయంగా రోస్టర్ను రూపొందించాలని డిమాండ్ చేశారు.
దశలవారీగా ఉద్యమం
రోస్టర్ సవరణ కోసం సర్పంచుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల వరకు, పంచాయతీ కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు వినతిపత్రాలు అందజేస్తామని నాయకులు తెలిపారు. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ఎదుట శాంతియుత ధర్నాలు, విలేకరుల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. గ్రామస్థాయిలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. గవర్నర్, రాష్ట్రపతికి వేలాది పోస్టుకార్డులు పంపడంతోపాటు విశ్వవిద్యాలయాలు, జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు.
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లోపు రోస్టర్ సవరించకపోతే కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి ప్రజాస్వామ్యవాదులతో కలిసి పనిచేస్తామని హెచ్చరించారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలోనూ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేరే బాలకిషన్, ప్రొఫెసర్ సవీన్ సౌడా, మాల స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు, AMSA ఓయూ అధ్యక్షుడు నామ సైదులుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.




