LB Nagar: మల్కాజిగిరి పరిధిలో స్పా సెంటర్లపై ఎస్ఓటీ దాడులు
LB Nagar: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటీ (SOT) పోలీసులు భారీ మెరుపు దాడులు నిర్వహించారు.
LB Nagar: మల్కాజిగిరి పరిధిలో స్పా సెంటర్లపై ఎస్ఓటీ దాడులు
LB Nagar: ఎల్బీనగర్ అక్రమ కార్యకలాపాలు, అనధికారిక క్రాస్ మసాజ్ సేవలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు భారీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. SOT టీంతో కలిసి కమిషనరేట్ పరిధిలోని స్పా సెంటర్లపై సమగ్ర తనిఖీలు చేపట్టారు.
113 సెంటర్లు తనిఖీ, 46 కేసులు: ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 113 స్పా సెంటర్లను తనిఖీ చేయగా, నిబంధనలు ఉల్లంఘించిన 46 సెంటర్ల నిర్వాహకులు, మేనేజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రజా భద్రత ఉత్తర్వులు, చట్టపరమైన నిబంధనలు, నిర్వహణ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ఈ కేసులు బుక్ అయ్యాయి.
ప్రధాన ఉల్లంఘనలు గుర్తింపు: తనిఖీల్లో పోలీసులు పలు తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించారు.
1. అవసరమైన అనుమతులు లేకుండా నిర్వహణ: చాలా స్పా సెంటర్లు అవసరమైన అనుమతులు, అప్రూవల్స్ లేకుండా, నిర్దేశిత నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నట్లు తేలింది.
2. పారదర్శక తలుపులు లేని డార్క్ రూమ్స్: చాలా సెంటర్లలో మూసివేయబడిన, బాగా కనిపించని విభజన గదులు నిర్మించి, పారదర్శక గాజు తలుపులు లేకుండా భద్రతా నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు.
3. కస్టమర్ ఐడి ప్రూఫ్ సేకరణ విఫలం: చాలా స్పా సెంటర్లు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలను సేకరించి రికార్డులు నిర్వహించడం లేదు. ఇది తీవ్రమైన భద్రతా సమస్యలకు దారితీస్తుందని అధికారులు చెప్పారు.
4. డిస్ప్లే బోర్డులు లేకుండా నిర్వహణ: పేరు బోర్డులు, బిజినెస్ సైనేజీలు లేకుండా పనిచేస్తున్న సెంటర్లు ఉన్నాయి. దీంతో ప్రజలకు, నియంత్రణ అధికారులకు వాటి గుర్తింపు దాచిపెడుతున్నట్లు తేలింది.
5. రికార్డుల నిర్వహణలో అలసత్వం: కస్టమర్ రిజిస్టర్, ఉద్యోగుల వివరాలు, తెరపిస్టుల వివరాలు, హాజరు రిజిస్టర్లు, చట్టబద్ధ పత్రాలను చాలా సెంటర్లు సరిగా నిర్వహించడం లేదు.
జోన్ వారీ వివరాలు:
LB Nagar Zone: 47 సెంటర్లు తనిఖీ, 17 కేసులు, 5 పోలీస్ స్టేషన్లు
Uppal Zone: 30 సెంటర్లు తనిఖీ, 11 కేసులు, 7 పోలీస్ స్టేషన్లు
Malkajgiri Division-I: 17 సెంటర్లు తనిఖీ, 7 కేసులు, 7 పోలీస్ స్టేషన్లు
Malkajgiri Division-II (Cantonment): 19 సెంటర్లు తనిఖీ, 11 కేసులు, 6 పోలీస్ స్టేషన్లు
లీగల్ యాక్షన్: నమోదైన కేసులను Bharatiya Nyaya Sanhita (BNS), Immoral Traffic (Prevention) Act (ITPA) తో పాటు ఇతర వర్తించే చట్టాల కింద నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆస్తి యజమానులకు సూచన: స్పా నిర్వహణకు కమర్షియల్ ప్రాంగణాలను లీజుకు ఇచ్చే ముందు అద్దెదారుల ఆధారాలు, కార్యకలాపాలను పూర్తిగా పరిశీలించాలని మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు బిల్డింగ్ యజమానులకు స్ట్రాంగ్ అడ్వైజరీ ఇచ్చారు. అక్రమ కార్యకలాపాలకు సహకరించే ఆస్తుల యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు పిలుపు: అనుమానాస్పదంగా, అనధికారంగా, అక్రమంగా నడుస్తున్న స్పా సెంటర్ల గురించి సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా కమిషనరేట్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.




