Malkajgiri: వినాయక్ నగర్ డివిజన్ సమస్యలను పరిష్కరించాలి: క్యానం రాజ్యలక్ష్మి!
Malkajgiri: మల్కాజిగిరి వినాయక్ నగర్ డివిజన్‌లో మౌలిక వసతులు, పారిశుద్ధ్య సమస్యలపై జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేసిన క్యానం రాజ్యలక్ష్మి.
Malkajgiri: వినాయక్ నగర్ డివిజన్ సమస్యలను పరిష్కరించాలి: క్యానం రాజ్యలక్ష్మి!
Malkajgiri: మల్కాజిగిరి వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతులు, పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి అధికారులను కోరారు. సోమవారం ఉదయం ఎంఎంసీ జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలో ఆమె పాల్గొని, స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
తరుణ్ ఎంక్లేవ్‌లో వీధి దీపాలను క్రమబద్ధీకరించడంతో పాటు, వర్షపు నీటి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని కోరారు. ఈస్ట్ ఆనంద్‌బాగ్ ఆర్‌యూబీ సమీపంలో వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని యూటర్న్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదే ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేక పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి ప్రాంతాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కోరారు.
లక్ష్మీనగర్‌లో పార్కు అభివృద్ధి పనులు చేపట్టి స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అధికారులను కోరారు. అలాగే వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని ఈస్ట్ ఆనంద్‌బాగ్ పార్కు ముందు రోడ్డు, ప్యారడైజ్ సమీపంలోని రోడ్డు, ఆనంద్‌బాగ్ ప్రధాన రహదారి పక్కన టేబుల్ డ్రెయిన్ నిర్మాణ పనులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సంబంధిత అనుమతులను త్వరితగతిన మంజూరు చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని క్యానం రాజ్యలక్ష్మి కోరారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్‌తో పాటు ఇంజినీరింగ్ విభాగం ఎస్‌ఈ లక్ష్మణ్, ఏఈ నవీన్, సూపర్‌వైజర్లు సాగర్, రమేష్, పారిశుద్ధ్య విభాగం డీఈ లావణ్య, సూపర్‌వైజర్ శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఏ కిష్టమ్మ, ఉద్యానవన విభాగం సూపర్‌వైజర్ వెంకటేష్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు జయకుమార్, పవన్, ఎస్‌వీఎస్ సుబ్రమణ్యం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. క్యానం రాజ్యలక్ష్మితో పాటు బీజేపీ నాయకుడు ఓం ప్రకాష్ పాల్గొన్నారు.




