Malkajgiri: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కార్యకర్తను పరామర్శించిన మైనంపల్లి

Malkajgiri: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన పార్టీ నాయకుడు సాగర్‌ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 2 Sept 2026 11:30 PM IST
Malkajgiri
X

Malkajgiri: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కార్యకర్తను పరామర్శించిన మైనంపల్లి

మల్కాజిగిరి: ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. పార్టీ కార్యక్రమం ముగించుకుని నిజామాబాద్‌కు బయలుదేరిన ఆయనకు మార్గమధ్యలో పార్టీ నాయకుడు సాగర్ గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలియడంతో వెంటనే తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు.

మల్కాజిగిరి చౌరస్తాలో పార్టీ కార్యక్రమం ముగించుకుని మైనంపల్లి హనుమంతరావు నిజామాబాద్‌కు వెళ్తుండగా, మిలిటరీ డెయిరీ ఫారం సమీపంలో కొంతమంది పార్టీ నాయకులు కనిపించడంతో ఆయన కారు ఆపారు. ఈ సందర్భంగా పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా కాప్రా పరిధిలోని కానాజిగూడ చౌరస్తాలో కేక్ కట్ చేస్తుండగా సాగర్‌కు హఠాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడని వారు తెలిపారు. వెంటనే సాగర్‌ను రష్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

విషయం తెలియగానే మైనంపల్లి హనుమంతరావు తన కారును ఆసుపత్రి వైపు మళ్లించాలని సూచించారు. ఆసుపత్రి యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడి అత్యవసర విభాగంలో సాగర్‌కు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అప్పటికే ఆయన కుమారుడు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెండు గంటలుగా ఆయన కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, సాగర్‌కు చికిత్స పూర్తయ్యే వరకు ఆసుపత్రిలోనే ఉండాలని మైనంపల్లి నిర్ణయించుకున్నారు.

వైద్యులు పరీక్షలు నిర్వహించి సాగర్‌ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని చెప్పిన తర్వాతే ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. అంతేకాకుండా సాగర్ కుటుంబం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని, ఆసుపత్రి బిల్లు మొత్తం తానే చెల్లిస్తానని ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు. సాగర్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అనంతరం తన ప్రయాణాన్ని కొనసాగించారు.

కార్యకర్తలకు ఆపద వచ్చినప్పుడు వెంటనే స్పందించి అండగా నిలిచే నాయకత్వం అవసరమని, పార్టీ కార్యకర్తలతో పాటు వారి కుటుంబాలను కూడా సొంత కుటుంబ సభ్యులుగా భావించే నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story