Malkajgiri: నేరేడ్‌మెట్ సైబర్ పోలీసుల చొరవతో రూ.85.20 లక్షలు సురక్షితం!

Malkajgiri: డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి నుంచి కాజేసిన రూ.85.20 లక్షలను నేరేడ్‌మెట్ సైబర్ క్రైమ్ పోలీసులు సకాలంలో స్పందించి సురక్షితం చేశారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 27 Aug 2026 7:08 PM IST
Malkajgiri
X

Malkajgiri: నేరేడ్‌మెట్ సైబర్ పోలీసుల చొరవతో రూ.85.20 లక్షలు సురక్షితం!

మల్కాజిగిరి: డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేసిన మోసంలో ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కోల్పోయిన రూ.85.20 లక్షలను నేరేడ్‌మెట్ సైబర్ క్రైమ్ పోలీసులు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సంబంధిత బ్యాంకింగ్ అధికారుల సమన్వయంతో సురక్షితం చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 21న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి శివయ్యకు గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాను ఎన్‌ఐఏ అధికారినని పరిచయం చేసుకున్న నిందితుడు.. శివయ్య ఆధార్ వివరాలు దుర్వినియోగమయ్యాయని, అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆయన ఆధార్ ఆధారంగా బ్యాంకు ఖాతా తెరిచి సుమారు రూ.2.50 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు నిర్వహించాడని చెప్పి భయపెట్టాడు. కర్ణాటక, కేరళలోనూ ఆయన వివరాలతో ఖాతాలు తెరిచినట్లు పేర్కొన్నాడు.

తెలుగులో మాట్లాడిన నిందితుడు తాను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపాడు. వీడియో కాల్‌లో మూడు నక్షత్రాల యూనిఫాం ధరించి కనిపిస్తూ తాను నిజమైన అధికారి అని నమ్మించాడు. అనంతరం విచారణకు సహకరించాలని, ‘ఆర్‌బీఐ వెరిఫికేషన్’ పేరుతో బ్యాంకు ఖాతాలోని డబ్బును తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని సూచించాడు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నగదు తిరిగి ఇస్తామని నమ్మించాడు.

దీంతో శివయ్య అదే రోజు రూ.85.20 లక్షలను నిందితులు సూచించిన ఖాతాకు బదిలీ చేశారు. అనంతరం మరో రూ.42 లక్షలు బదిలీ చేయాలని కోరడంతో అనుమానం వచ్చిన ఆయన వెంటనే నేరేడ్‌మెట్ పోలీసులను ఆశ్రయించారు.

సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ బృందం వెంటనే స్పందించి బాధితుడితో కలిసి జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదు పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేసింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సంబంధిత సైబర్ క్రైమ్ పోలీసులు, బ్యాంకింగ్ అధికారులతో సమన్వయం చేసి తక్షణ చర్యలు చేపట్టారు. ఫలితంగా బదిలీ చేసిన మొత్తం రూ.85,20,000ను హోల్డ్/లియన్‌లో ఉంచి సురక్షితం చేశారు. దీంతో నిందితులు ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడం లేదా ఇతర ఖాతాలకు బదిలీ చేయడం నిరోధించగలిగారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పోలీసులు, ఎన్‌ఐఏ, ఆర్‌బీఐ లేదా ఇతర ప్రభుత్వ అధికారులు వెరిఫికేషన్ పేరుతో డబ్బును మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేయమని కోరరని పోలీసులు స్పష్టం చేశారు. ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేస్తామని, కేసులు పెడతామని బెదిరించే వ్యక్తులను నమ్మవద్దని సూచించారు.ఓటీపీ, పిన్, సీవీవీ, పాస్‌వర్డ్, బ్యాంకు ఖాతా వివరాలు వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదన్నారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో పాటు జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదు పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆర్థిక సైబర్ మోసాల్లో ప్రతి నిమిషం కీలకమని, సత్వరమే ఫిర్యాదు చేస్తే నగదును నిలుపుదల చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story