Malkajgiri: గృహ కార్మికుల వివరాల నమోదుకు ‘మీ సురక్ష 2.0’ పోర్టల్

Malkajgiri: ఇళ్లలో పనిచేసే పనివారు, డ్రైవర్లు, వాచ్‌మెన్ల పూర్వాపరాలు నమోదు చేసి ధ్రువీకరించేందుకు సీపీ బి. సుమతి ‘మీ సురక్ష 2.0’ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించారు.

RAHUL, MEERPET
Published on: 27 Oct 2026 10:56 PM IST
Malkajgiri
X

Malkajgiri: గృహ కార్మికుల వివరాల నమోదుకు ‘మీ సురక్ష 2.0’ పోర్టల్

హైదరాబాద్: ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాల నివారణే లక్ష్యంగా మల్కాజిగిరి పోలీసులు ‘మీ సురక్ష 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇళ్లలో పనిచేసే పనివారు, డ్రైవర్లు, వాచ్‌మెన్లు, సెక్యూరిటీ గార్డుల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

సరూర్‌నగర్‌లోని భాగ్యలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌లో మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి. సుమతి, ఐపీఎస్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కమిషనరేట్‌ పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఏకకాలంలో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో పనిచేసే వారి వివరాలను పోలీస్‌ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

నమోదైన వివరాలను పరిశీలించి, సంబంధిత వ్యక్తుల నేపథ్యాన్ని పోలీసులు ధ్రువీకరించనున్నారు. గృహ సహాయకుల వివరాలు పోలీసుల వద్ద అందుబాటులో ఉండటం ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంతో పాటు నేరాల నియంత్రణకు దోహదపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రజలు తమ వద్ద పనిచేసే వారి వివరాలను నమోదు చేసి, పోలీసుల ధ్రువీకరణ ప్రక్రియకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్‌ డీసీపీ, ఏసీపీలు, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బందితో పాటు కాలనీ అసోసియేషన్ల ప్రతినిధులు, హాస్టల్‌ యజమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET