Malkajgiri: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు, సిబ్బందికి భద్రత కల్పించాలి
Malkajgiri: మల్కాజిగిరి ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు, సిబ్బందిపై వేధింపులను అరికట్టి భద్రత కల్పించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.
Malkajgiri: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు, సిబ్బందికి భద్రత కల్పించాలి
మల్కాజిగిరి: మల్కాజిగిరి ప్రభుత్వ జూనియర్,డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులు, ప్రభుత్వ సిబ్బందిపై వేధింపులు, బెదిరింపులు,అసాంఘిక వ్యక్తుల సంచారాన్ని అరికట్టి భద్రత కల్పించాలని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి కార్తీక్ డిమాండ్ చేశారు. ప్రతి విద్యాసంస్థలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతర పోలీసు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు.
కళాశాలల్లో కొంతమంది వ్యక్తులు విద్యార్థులను వేధిస్తూ,విద్యా వాతావరణానికి భంగం కలిగిస్తున్నారని కార్తీక్ ఆరోపించారు. విద్యార్థులతో పాటు అధ్యాపకులు,ఫ్యాకల్టీ, ప్రభుత్వ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం, బెదిరింపులకు పాల్పడటం ఆందోళనకరమన్నారు. విద్యార్థులు భయంలేకుండా చదువుకునేలా, అధ్యాపకులు,సిబ్బంది ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా విధులు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థులను వేధిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని ఎస్ఎఫ్ఐ నాయకులు పట్టుకుని నేరేడ్మెట్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి,వాస్తవాలను నిర్ధారించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
విద్యార్థుల భద్రతపై ఈగిల్ టీమ్ ప్రత్యేక దృష్టి సారించి విద్యాసంస్థలను క్రమం తప్పకుండా సందర్శించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది మేడ్చల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కోరింది. విద్యార్థులు కళాశాలకు వచ్చే, వెళ్లే సమయాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు కళాశాలల పరిసరాల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచాలని సూచించింది.
విద్యార్థుల భద్రత కోసం పోలీసు, విద్యాశాఖ అధికారులు, ఈగిల్ టీమ్ సమన్వయంతో పనిచేసి వేధింపులు, బెదిరింపులు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్, మల్కాజిగిరి మండల అధ్యక్షుడు, మండల కార్యదర్శి అనిరుధ్, జిల్లా కమిటీ సభ్యుడు యశ్వంత్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.




